భారత తీర ప్రాంతంలో హై అలర్ట్‌

Indian Coast Guard On Alert Following Sri Lanka Blasts - Sakshi

న్యూఢిల్లీ: శ్రీలంకలో మరణహోమం నేపథ్యంలో భారత కోస్ట్‌ గార్డ్‌ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల గుండా భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈస్టర్‌ పర్వదినాన జరిగిన వరుస బాంబు పేలుళ్ల వెనుక ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ ‘నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ (ఎన్‌టీజే)’ హస్తం ఉందని శ్రీలకం ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ద్వీప దేశం నుంచి పారిపోయే అవకాశం ఉందని అక్కడి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన భారత కోస్ట్‌ గార్డ్‌ అధికారులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా భారత సముద్ర జలాల్లో గస్తీ నిర్వహించడానికి భారీగా షిప్పులను, డ్రోనియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మోహరించినట్టు ఏఎన్‌ఐ వార్త సంస్థ తెలిపింది. భారత జలాల్లోకి ప్రవేశించే అనుమానిత బోట్స్‌ను గుర్తించడానికి పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీలంక వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం శ్రీలంకలో జరిగిన వరసు పేలుళ్లలో మృతుల సంఖ్య దాదాపు 300 మందికి చేరింది. దాయాది పాకిస్తాన్‌ నుంచి సుముద్ర జలాల గుండా భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు 2008 నవంబర్‌ 26వ తేదీన ముంబైలో మరణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top