పాక్‌పై జలఖడ్గం 

India ups ante, to stop its Indus water share to Pak - Sakshi

ఆ దేశానికి వెళ్లే జలాలను నిలిపేయాలని నిర్ణయించిన భారత్‌

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ చుట్టూ భారత్‌ ఉచ్చు బిగుస్తోంది. సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాక్‌కు వెళ్తున్న తన నీటి వాటాను నిలిపివేయాలని భారత్‌ నిర్ణయించింది. ఈ విషయాన్ని జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కారీ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే 6 సంవత్సరాలు పట్టొచ్చని, నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి అప్పటిలోగా 100 మీటర్ల ఎత్తయిన డ్యామ్‌లను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయంతో 1960 నాటి ఒప్పందం ఉల్లంఘనకు గురవదని, మన దేశ ప్రజలకు దక్కాల్సిన న్యాయబద్ధ హక్కుల్ని కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు వెళ్తున్న మన నీటిని నిలిపివేసి కశ్మీర్, పంజాబ్‌ రాష్ట్రాలకు సరఫరా చేయాలని యోచిస్తున్నారు. పాకిస్తాన్‌కు భారత జలాలను నిలిపివేయాలని రెండు నెలల క్రితమే నిర్ణయించామని, గడ్కారీ అదే సంగతిని తాజాగా పునరుద్ఘాటించారని మరో సీనియర్‌ అధికారి తెలిపారు. 

డ్యామ్‌ నిర్మాణానికి రూ.485.38 కోట్లు.. 
‘పాక్‌లోకి ప్రవహిస్తున్న మన నీటి వాటాను నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జలాలను కశ్మీర్, పంజాబ్‌లకు మళ్లిస్తాం. ఇందుకోసం షాపూర్‌–కాందిలో రావి నదిపై డ్యామ్‌ నిర్మాణం ప్రారంభమైంది. కథువాలోని ఉజ్‌ నదిపై నిర్మించిన డ్యామ్‌లో సింధూ జలాల్లో మనకు లభించే వాటాను నిల్వచేసి కశ్మీర్‌కు అందిస్తాం. మిగిలిన నీటిని రెండో రావి–బియాస్‌ లింకు ద్వారా ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తాం’ అని గడ్కారీ ట్వీట్‌ చేశారు. మనకు దక్కాల్సిన 3 నదుల నీరు పాక్‌కు వెళ్తోందని, వాటిపై డ్యామ్‌లు కట్టి, ఆ జలాల్ని యమునా నదికి మళ్లిస్తామని గడ్కారీ చెప్పారు. పంజాబ్‌లోని షాపూర్‌–కాంది వద్ద రావి నదీపై డ్యామ్‌ నిర్మాణానికి డిసెంబర్‌లోనే ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌ ఐదేళ్ల కాలానికి రూ.485.38 కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2013లోనే ప్రారంభమైనా కశ్మీర్‌ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడంతో మధ్యలో నిలిచిపోయాయి. 2018లో పంజాబ్, కశ్మీర్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో పనులు పునఃప్రారంభమయ్యాయి. 

మిగులు నీరు రాజస్తాన్, హరియాణాలకు.. 
పాకిస్తాన్‌ నుంచి తిరిగి పొందే నీటిలో కశ్మీర్, పంజాబ్‌ రాష్ట్రాలు వినియోగించుకోగా మిగిలిన జలాలను రాజస్తాన్, హరియాణాలకు తరలిస్తామని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ చెప్పారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం చాన్నాళ్లుగా మన దేశానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేస్తుందని అన్నారు. ఈ విషయంలో చొరవచూపడంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ విఫలమైందని పేర్కొన్నారు. మోదీ చొరవతో షాపూర్‌–కాంది డ్యామ్‌ పనులు పునఃప్రాంభమయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రావి నది నీరంతా భారత్‌కు అందుబాటులోకి వస్తుంది.

టమోటాలు బంద్‌!
పాక్‌ ఉత్పత్తులపై సుంకాలు 200 శాతం పెరిగిపోవడంతో దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో పాక్‌ నుంచి వస్తున్న సిమెంట్‌ లారీలు సరిహద్దులోనే ఆగిపోయాయి. మన దిగుమతిదారులు పాక్‌కు ఇచ్చిన ఆర్డర్లను రద్దుచేసుకుంటున్నారు. భారత వ్యాపారులు కూడా పాక్‌కు ఎగుమతుల్ని నిలిపివేస్తున్నారు. ఆ దేశానికి టమోటాలను ఎగుమతి చేయొద్దని మధ్యప్రదేశ్‌ రైతులు నిర్ణయించారు. జబువా జిల్లాలో దాదాపు 5వేల మంది రైతులు టమోటాలు పండిస్తున్నారు. ఇక్కడి నుంచి రోజూ 70 నుంచి 100 ట్రక్కుల్లో టమోటాలు పాకిస్తాన్‌కు ఎగుమతి అవుతున్నాయి. పుల్వామా దాడికి నిరసనగా పాక్‌కు టమోటాలు పంపకూడదని రైతులు నిర్ణయించారు. ‘మేం పంపిన తిండి తిని వాళ్లు మా సైనికుల్నే చంపుతున్నారు. సైనికులు లేకపోతే మనం బతికేదెలా.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎగుమతులు ఆపేయడం వల్ల ధర తగ్గినా మేం దిగులుచెందం’ అని ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు, బుధవారం పాకిస్తాన్‌ నుంచి సిమెంటు లోడుతో వస్తున్న 800 లారీలను వాఘా సరిహద్దులోనే భారత ప్రభుత్వం నిలిపివేసింది. మరో 800 లారీలు వెనక్కి వెళ్లిపోయాయి.
   
సింధూ ఒప్పందం  ఇదీ 
1960లో భారత్, పాకిస్తాన్‌ మధ్య కుదిరిన సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌ జలాలపై పూర్తి హక్కులు పాకిస్తాన్‌కు దక్కాయి. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌లలోని నీటిని భారత్‌కు కేటాయించారు. రావి, బియాస్, సట్లెజ్‌ నదుల రూపంలో భారత్‌కు 33 మిలియన్‌ ఎకరాల అడుగుల(ఎంఏఎఫ్‌) జలాలు లభించాయి. ఈ మూడు నదులపై డ్యామ్‌లు నిర్మించి అందులో 95 శాతం నీటిని దేశ అవసరాలకు వాడుతున్నాం. మిగిలిన 5 శాతం(1.6 ఎంఏఎఫ్‌) నీరు పాక్‌లోకి ప్రవహిస్తోంది. ఈ నీటిని తిరిగి పొందేందుకే భారత్‌ షాపూర్‌–కాంది డ్యామ్‌ నిర్మించాలని నిర్ణయించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top