రష్యాలో వారిద్దరు భేటీ కావడం లేదు: భారత్‌

India Denies Chinese Media Report That Rajnath Singh May Meet His Counterpart - Sakshi

న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యాలో చైనా రక్షణ మంత్రి వీ ఫెంగ్‌తో భేటీ కానున్నారన్న చైనా అధికార మీడియా వార్తలను భారత విదేశాంగ కొట్టిపారేసింది. రాజ్‌నాథ్‌ ఎవరితోనూ భేటీ కావడం లేదని స్పష్టం చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియెట్‌ సేనల గెలుపునకు 75 ఏళ్లు నిండుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 11 దేశాల సైనిక బలగాల పరేడ్‌లో పాల్గొనేందుకు రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా రక్షణ మంత్రి కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో.. ‘‘ చైనా రక్షణ మంత్రి వీ ఫెంగ్‌ బుధవారం నాటి రష్యా విక్టరీ పరేడ్‌కు హాజరవుతారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది’’ అని గ్లోబల్‌ టైమ్స్‌ ట్వీట్‌ చేసింది. 

ఈ విషయంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇరువురి మధ్య ఎలాంటి భేటీ జరగబోవడం లేదని స్పష్టం చేశారు. ఇక రష్యాకు చేరుకున్న సందర్భంగా.. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఇదే తన తొలి అధికారిక పర్యటన అని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న  ప్రత్యేక బంధానికి ప్రతీక అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అదే విధంగా మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ పరేడ్‌లో‌ కవాతు చేసే అవకాశం భారత సైనికులకు లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ సన్నాహాల్లో లక్షలాది మంది భారత జవాన్లు సోవియట్‌ ఆర్మీకి సహాయంగా నిలిచారని.. ఈ క్రమంలో అనేక మంది గాయపడ్డారని గుర్తుచేసుకున్నారు.(రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ)

కాగా జూన్‌ 15 నాటి గల్వాన్‌ ఘటన తర్వాత ఇరు దేశాల మంత్రులు ఇంతవరకు ముఖాముఖి భేటీ కాలేదు. డ్రాగన్‌ ఆర్మీ దుశ్చర్య కారణంగా 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు భారత్‌- చైనా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ఇక అనేక పరిణామాల అనంతరం గల్వాన్‌ సహా అన్ని ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి వెనుదిరిగేందుకు భారత్- చైనా అంగీకరించాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన ఎల్జీ స్థాయి చర్చల్లో ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఇదిలా ఉండగా..  రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై చర్చలు జరిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top