రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ | Sakshi
Sakshi News home page

రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ

Published Wed, Jun 24 2020 4:28 AM

Rajnath Pays Tribute To Gandhi Statue At The Indian Embassy In Moscow - Sakshi

మాస్కో/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ అన్ని రకాల మార్గాల్లోనూ అత్యున్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళలోనే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సమావేశానికి హాజరైన జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ సమక్షంలోనే ఆ దేశంపై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, భాగస్వామ్య పక్షాలకు చట్టబద్ధంగా కలిగే ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, అన్ని దేశాలకు మంచి జరిగేలా, పటిష్టమైన కొత్త ప్రపంచం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ సంబంధాల్లో నైతికత ఉండాలని చెప్పారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లారోవ్‌ స్పష్టం చేశారు.

అందరి ప్రయోజనాలు కాపాడాలి : వాంగ్‌ యీ 
రష్మా, భారత్, చైనా కలసికట్టుగా సమస్యాత్మక అంశాలను ఎదుర్కోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. 3 దేశాల సంబంధాల పరిరక్షణ కోసం అన్నిదేశాల ప్రయోజనాలు కాపాడేలా వ్యహరించాలన్నారు.

మహాత్ముడికి రాజ్‌నాథ్‌ నివాళులు 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం మాస్కోలో భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్‌నాథ్‌.. చైనా రక్షణమంత్రి వీ ఫెంగ్‌తో సమావేశం కావడం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియెట్‌ సేనల విజయానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే 11 దేశాల సైనిక బలగాల పెరేడ్‌లో పాల్గొనేందుకు రాజ్‌నాథ్‌ రష్యా వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement