హేమ భర్త చింతన్ ఉపాధ్యాయ్ అరెస్టు
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్, ఆమె లాయర్ హరీశ్ భంబానీ హత్య కేసులో ఆమె నుంచి విడిపోయిన భర్త చింతన్ ఉపాధ్యాయ్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
ముంబయి: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్, ఆమె లాయర్ హరీశ్ భంబానీ హత్య కేసులో ఆమె నుంచి విడిపోయిన భర్త చింతన్ ఉపాధ్యాయ్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దాదాపు ఈ హత్య చోటుచేసుకుని వారం రోజులు గడిచిన తర్వాత సోమవారం రాత్రి చింతన్ ను ప్రశ్నించేందుకు పిలిపించిన పోలీసులు అనంతరం మంగళవారం తెల్లవారు జామున 3.30గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
తన భార్యతో విభేదాల కారణంగా గత కొంతకాలంగా చింతన్ వేరుగా ఉంటున్నాడు. వారి విడాకుల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతకుముందు ఈ కేసులో నలుగురును అరెస్టు చేయగా చింతన్ అరెస్టు ఐదోది. హేమా హత్య వెనుక చింతన్ హస్తం ఉండిఉండొచ్చని ఆమె బంధువుల ఆరోపణల మేరకు అతడిని ప్రశ్నించిన పోలీసులు చివరకు అరెస్టు చేశారు. దీంతో కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.
హేమ (43), భంబానీ (65) చేతులు తాడుతో కట్టేసి కార్డ్‌బోర్డు బాక్స్‌ల్లో కుక్కిన వారి శవాలు గత ఆదివారం వెలుగుచూడటం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. వీరి జంటహత్యలకు కారణమేమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్లే వీరి హత్యలు జరిగాయా? లేక ఆర్థిక లావాదేవీలు కారణమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసిన విషయం విధితమే.


