breaking news
hema upadhyay
-
'హేమను తెలిసిన వారే చంపేశారు'
ముంబై: ప్రముఖ ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ్‌ను ఎవరో ఆమెకు బాగా తెలిసినవారే హత్య చేసి ఉంటారని ఆమె తల్లి బీనా మనుభాయ్ హిరాని (72) అభిప్రాయపడ్డారు. హత్యకు గురవడానికి ముందురోజు తన కూతురు హేమ ఫోన్ చేసి.. తెలిసిన వారిని కలవడానికి వెళుతున్నాను, మర్నాడు మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పిందన్నారు. అయితే కూతురి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న తనకు ఆమె మరణవార్త తెలిసిందని బీనా మనుభాయ్ వాపోయారు. హేమ మృతివార్తను తాను నమ్మలేకుండా ఉన్నానని, తన ఆరోగ్యం పట్ల హేమ ఎంతో శ్రద్ధ తీసుకునేదని బీనా తెలిపారు. హేమ భర్త చింతన్ గానీ, ఆమెతో కలిసి పనిచేసిన విద్యాధర్ రాజ్‌భర్ గానీ హత్యకు పాల్పడినట్లు నమ్మకంగా చెప్పలేనంది. అయితే తన కూతుర్ని హత్య చేసినవారు ఎవరైనా సరే.. కఠినంగా శిక్షించబడాలని ఆమె డిమాండ్‌చేశారు. హేమా, చింతన్ల మధ్య సుదీర్ఘ కాలంగా విభేదాలున్నాయని తెలిపింది. అయితే ఆ విభేదాలు తన కూతురు హత్యకు కారణం అవుతాయని ఊహించలేదని బీనా తెలిపిపారు. -
హేమ భర్త చింతన్ ఉపాధ్యాయ్ అరెస్టు
-
హేమ భర్త చింతన్ ఉపాధ్యాయ్ అరెస్టు
ముంబయి: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్, ఆమె లాయర్ హరీశ్ భంబానీ హత్య కేసులో ఆమె నుంచి విడిపోయిన భర్త చింతన్ ఉపాధ్యాయ్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దాదాపు ఈ హత్య చోటుచేసుకుని వారం రోజులు గడిచిన తర్వాత సోమవారం రాత్రి చింతన్ ను ప్రశ్నించేందుకు పిలిపించిన పోలీసులు అనంతరం మంగళవారం తెల్లవారు జామున 3.30గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. తన భార్యతో విభేదాల కారణంగా గత కొంతకాలంగా చింతన్ వేరుగా ఉంటున్నాడు. వారి విడాకుల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతకుముందు ఈ కేసులో నలుగురును అరెస్టు చేయగా చింతన్ అరెస్టు ఐదోది. హేమా హత్య వెనుక చింతన్ హస్తం ఉండిఉండొచ్చని ఆమె బంధువుల ఆరోపణల మేరకు అతడిని ప్రశ్నించిన పోలీసులు చివరకు అరెస్టు చేశారు. దీంతో కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. హేమ (43), భంబానీ (65) చేతులు తాడుతో కట్టేసి కార్డ్‌బోర్డు బాక్స్‌ల్లో కుక్కిన వారి శవాలు గత ఆదివారం వెలుగుచూడటం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. వీరి జంటహత్యలకు కారణమేమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్లే వీరి హత్యలు జరిగాయా? లేక ఆర్థిక లావాదేవీలు కారణమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసిన విషయం విధితమే. -
'హేమకు చాలాసార్లు డబ్బులిచ్చా'
ముంబై: ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయతో తనకు ఎలాంటి వివాదాలూలేవని, ఇప్పటికీ ప్రేమిస్తున్నానని ఆమె భర్త చింతన్ ఉపాధ్యాయ పోలీసుల విచారణలో చెప్పాడు. తమ మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలను కూడా పరిష్కరించుకున్నట్టు తెలిపాడు. హేమ ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది భంభానీలు ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. గతంలో చింతన్తో విభేదాల కారణంగా హేమ విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ కేసు నడుస్తుండగానే ఆమె హత్యకు గురైంది. ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు హేమ భర్త చింతన్ను విచారించారు. 'విడాకులకు దరఖాస్తు చేసినపుడు ఓ ఫ్లాట్ విషయంలో మా మధ్య వివాదాలుండేవి. ఈ ఫ్లాట్ కావాలని హేమ పలుసార్లు కోరగా, నేనెప్పుడూ తిరస్కరించలేదు. ఈ ఫ్లాట్ అమ్మేసి డబ్బును చెరి సగం పంచుకుందామని చెప్పాను. నేను ఢిల్లీలో ఉన్నా.. ముంబై వచ్చినప్పుడల్లా హేమ ఇంట్లోనే ఉండేవాడిని. మా ఇద్దరి మధ్య సమస్యులు లేవు. చాలా సార్లు ఆమె డబ్బు అడగ్గా, నేను సాయం చేశాను. హేమ అదృశ్యమైన రోజు కూడా నేను 2 లక్షల రూపాయలను భరణం కింద ఆమె లాయర్‌కు ఇచ్చాను' అని చింతన్ పోలీసులకు చెప్పాడు. హేమ అంత్యక్రియలకు చింతన్ హాజరయ్యాడు. -
ఆర్టిస్టు హత్యకేసులో కీలక మలుపు!
ముంబై: మహారాష్ట్రను కుదిపేసిన ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ్, ఆమె లాయర్ హరీశ్ భంబానీ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాధూ రాజ్‌భార్‌ను వారణాసిలో పోలీసులు అరెస్టుచేశారు. రాజ్‌భార్ కూడా వృత్తిరీత్యా కళాకారుడే. ఈ జంట హత్యలకు ముందు శుక్రవారం రాజ్‌ధార్ చివరిసారిగా హేమకు ఫోన్ చేశాడని పోలీసులు భావిస్తున్నారు. విభేదాలతో తనకు దూరంగా ఉంటున్న చింతన్ ఉపాధ్యాయ్ గురించి కొన్ని విషయాలు చెప్తానని ఆమెను రాజ్‌ధార్ పిలిచి ఉంటాడని, దీంతో ఆమె తన లాయర్ భంబానీతో కలిసి అతని వద్దకు వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే వీరి హత్యల్లో రాజ్ధార్కు ప్రమేయం నేరుగా ఉందా? అన్న విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రవీకరించలేదు. హేమ (43), భంబానీ (65) చేతులు తాడుతో కట్టేసి కార్డ్‌బోర్డు బాక్స్‌ల్లో కుక్కిన వారి శవాలు ఆదివారం వెలుగుచూడటం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. వీరి జంటహత్యలకు కారణమేమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్లే వీరి హత్యలు జరిగాయా? లేక ఆర్థిక లావాదేవీలు కారణమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. -
అట్టపెట్టెలో శవమై కనిపించిన ఆర్టిస్ట్
ముంబై: శనివారం రాత్రి ముంబైలోని కందిల్వీ ప్రాంతంలోని ఓ కాలువలో కనుగొన్న మృతదేహాలను ప్రముఖ చిత్రకారిణి హేమ ఉపాద్యాయ్, ఆమె లాయర్ హరీష్ బంబానివిగా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు వీరిద్దరిని హతమార్చి అట్టపెట్టెల్లో కుక్కి.. స్మశానవాటిక పక్కనే ఉన్న కాలువలో పడేసారు. కాలువలో ఉన్న మృతదేహాలను గమనించిన స్వీపర్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను సేకరించి పోస్ట్ మార్టం కోసం తరలించారు. హంతకులు ఎవరనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇద్దరినీ ఊపిరాడకుండా చేసి చంపినట్లుగా ప్రాధమికంగా నిర్ధారించిన పోలీసులు.. పోస్టు మార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు. హేమ ఉపాద్యాయ్ గుజరాత్ లలిత కళా అకాడమీ అవార్డుతో పాటు జాతీయ లలిత కళా అకాడమీ అవార్డును అందుకున్నారు. హేమ భర్త చింతన్ కూడా చిత్రకారుడే. భర్తతో హేమకు విభేదాలున్నాయి. గతంలో తన గదిలోని గోడలపై చింతన్ అసభ్యకరమైన చిత్రాలు వేశాడని, వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేసింది. ఆ కేసులో హేమకు లాయర్ హరీష్ బంబాని సహకరించాడు. ఈ హత్యలకు సంబంధించి ఇప్పటికే హేమ ఉపాద్యాయ్ భర్త చితన్ తో పాటు మరి కొందరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.


