ఆర్టిస్టు హత్యకేసులో కీలక మలుపు!
మహారాష్ట్రను కుదిపేసిన ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ్, ఆమె లాయర్ హరీశ్ భంబానీ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
ముంబై: మహారాష్ట్రను కుదిపేసిన ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ్, ఆమె లాయర్ హరీశ్ భంబానీ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాధూ రాజ్‌భార్‌ను వారణాసిలో పోలీసులు అరెస్టుచేశారు. రాజ్‌భార్ కూడా వృత్తిరీత్యా కళాకారుడే. ఈ జంట హత్యలకు ముందు శుక్రవారం రాజ్‌ధార్ చివరిసారిగా హేమకు ఫోన్ చేశాడని పోలీసులు భావిస్తున్నారు. విభేదాలతో తనకు దూరంగా ఉంటున్న చింతన్ ఉపాధ్యాయ్ గురించి కొన్ని విషయాలు చెప్తానని ఆమెను రాజ్‌ధార్ పిలిచి ఉంటాడని, దీంతో ఆమె తన లాయర్ భంబానీతో కలిసి అతని వద్దకు వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే వీరి హత్యల్లో రాజ్‌ధార్‌కు ప్రమేయం నేరుగా ఉందా? అన్న విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రవీకరించలేదు.
హేమ (43), భంబానీ (65) చేతులు తాడుతో కట్టేసి కార్డ్‌బోర్డు బాక్స్‌ల్లో కుక్కిన వారి శవాలు ఆదివారం వెలుగుచూడటం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. వీరి జంటహత్యలకు కారణమేమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్లే వీరి హత్యలు జరిగాయా? లేక ఆర్థిక లావాదేవీలు కారణమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


