జూలై చివరి వరకూ అదే మంచిది!

Gurgaon Multinationals May Have To Work From Home Till July End Official  - Sakshi

 ఎంఎన్‌సీలకు జూలై చివరిదాకా వర్క్ ఫ్రం హోం  మంచిది

గుర్గావ్ లోని టెక్ ఉద్యోగులకు మరో రెండు నెలలు అంతే

సాక్షి, న్యూఢిల్లీ:  కోవిడ్ -19 మహమ్మారికి ఇంకా అడ్డు కట్ట పడని నేపథ్యంలో గుర్గావ్  పరిపాలనా విభాగం  అక్కడి కొర్పారేట్, టెక్ కంపెనీలకు కీలక సూచన చేసింది.  ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ కంపెనీలోని ఉద్యోగులు మరో  రెండు నెలలపాటు ఇంటినుంచే  పనిచేయాల్సి వుంటుందట. ఈ  మేరకు గుర్గావ్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవో, హర్యానా అదనపు చీఫ్ సెక్రటరీ వీఎస్ కుందు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ విస్తరణను నిరోధించేందుకు వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుండే పనిచేసేలా కంపెనీలు చూసుకోవడం మంచిదని ఆయన సూచించారు. కరోనావైరస్ మహమ్మారి స్వభావం అలాంటిది,  మునుపటి సాధారణ స్థితికి తిరిగి ఎప్పటికి చేరతామో ఎవరికీ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.  

కార్పొరేట్ కేంద్రం గుర్గావ్‌లోనిఎంఎన్‌సీలు, బీపీఓలు, ఐటీ కంపెనీలు, కార్పొరేట్‌లు, పరిశ్రమలు తమ ఉద్యోగులను జూలై చివరి వరకు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాల్సి ఉంటుందన్నారు. లాక్ డౌన్వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను సాధ్యమైనంత వరకు ఇంటి నుండి పని (వర్క్ ఫ్రం హోం)  చేయించుకునే విధానాన్ని కొనసాగించాలన్నారు.  (కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు)

ఇంటినుంచే పనిచేయడం ఉత్పాదక రంగంలో సాధ్యం కాదు కాబట్టి, సాధ్యమైన ఇతర రంగాలన్నీ  వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబించాలని సూచించారు. భౌతిక దూరం లాంటి నిబంధనలను పాటిస్తూ డిఎల్ఎఫ్ సహా అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతినిస్తున్నట్టు  కుందు తెలిపారు. ఇంటినుంచి పని సాధ్యం కాని కార్మికులు ఇప్పటికే సైట్లో ఉంటున్న నిర్మాణరంగ కార్మికులు, ప్రాజెక్టుకు అతి సమీపంలో (నడక దూరంలో) ఉన్నవారు సామాజిక దూర నిబంధనలకు కట్టుబడి పని తిరిగి ప్రారంభించడానికి అనుమతివుంటుందని ఆయన చెప్పారు. 

గుర్గావ్‌లోని పరిస్థితి చాలా నియంత్రణలో ఉందని, కమ్యూనిటీ ట్రాన్సమిషన్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని  ఆయన వెల్లడించారు. ప్రాణాలను కాపాడటం, జీవనోపాధి కల్పించడం అనే రెండు లక్ష్యాలపై తాము పనిచేస్తున్నామన్నారు. జిల్లా యంత్రాంగం సర్వేలు నిర్వహిస్తోందనీ, రేషన్ కార్డులు లేని పేద కుటుంబాలకు ఆహార కూపన్లు అందించడం ప్రారంభించి, మూడు నెలల పాటు రేషన్ అందజేస్తున్నట్టు తెలిపారు. అలాగే దుస్తులు సంస్థలకు  రెండింటికీ తమ ప్లాంట్లలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) తయారీకి అనుమతి ఇచ్చామనీ, తయారీ కూడా ప్రారంభించామని కుందు చెప్పారు. కాగా నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో భాగమైన గుర్గావ్‌ను మిలీనియం సిటీగా పిలుస్తారు. ఇది ఇన్ఫోసిస్, జెన్‌పాక్ట్, గూగుల్,  మైక్రోసాఫ్ట్ లాంటి టెక్నాలజీ దిగ్గజాలు సహా అనేక బీపీఓలు, ఎంఎన్‌సీలకు నిలయం. అంతేకాదు ఆటోమొబైల్ పరిశ్రమకు గుర్గావ్ ప్రధాన కేంద్రంగా ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top