అటల్‌జీకి మోదీ, అమిత్‌ షా అరుదైన నివాళి

  Great tribute to AtalBihariVajpayee  by PM Modi,  Amit Shah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్రలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వాజ్‌పేయి పట్ల తమ గౌరవాన్ని  చాటుకున్నారు.  ప్రధాని మోదీ, అమిత్‌ షా  కాలినడకన అంతిమ యాత్రలో ముందుకు సాగిపోతున్నారు.  తద్వారా తమ నేతకు కడసారి నివాళులర్పించేందుకు భారీగా తరలివచ్చిన జన సందోహానికి, బీజేపీ నేతలు, శ్రేణులకు  స్ఫూర్తిగా నిలిచారు.  కాగా తమ మహానేతకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర కొనసాగుతోంది.

అంతకుముందు వాజ్‌పేయి నివాసంనుంచి బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న వాజ్‌పేయి భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఇతర ముఖ్యనేతలు నివాళులర్పించారు. కాగా ఈ సాయంత్రం రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో పూర్తి అధికారిక లాంఛనాల మధ్య వాజ్‌పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు స్మృతి స్థల్‌లో  దాదాపు ఏర్పాట్లనీ పూర్తి చేశారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.  అలాగే నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్‌, లక్ష్మణ్‌ కిరిల్లా, అబ్దుల్‌ హసన్‌ మహ్మద్‌ అలీ, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్‌లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆఫ్గనిస్తాన్‌  మాజీ ప్రెసిడెంట్‌  హమీద్‌ ఖర్జాయ్‌ కూడా  అటల్‌జీకి  నివాళులర్పించేందుకు  ఢిల్లీకి చేరుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top