
సీఎం సహా ఆరుగురు మంత్రుల ఓటమి
గత నెలలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారీస్థాయిలో 83 శాతం నమోదైన ఓటింగ్ బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని ఆ పార్టీ నేతలు సైతం ఊహించి ఉండకపోవచ్చు.
పనాజి: గత నెలలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారీస్థాయిలో 83 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈ ఓటింగ్ బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని ఆ పార్టీ నేతలు సైతం ఊహించి ఉండకపోవచ్చు. ఇటీవల నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు వస్తాయని, సొంతంగానే అధికారం చేపడుతుందని వచ్చింది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో రికార్డు స్థాయిలో కేబినెట్‌లో బీజేపీకి చెందిన 8 మంత్రులకు గానూ సీఎం సహా 6 మంది మంత్రులు ప్రత్యర్ధి కాంగ్రెస్, ఇతర పార్టీ నేతల చేతిలో ఓటమి పాలయ్యారు. గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్టే చేతిలో 7వేలకు పైగా ఓట్లతో ఓటమి చవిచూడటం బీజేపీపై ప్రజల విముఖతకు సంకేతాలిస్తోంది.
ఓటమి అనంతరం లక్ష్మీకాంత్ పర్సేకర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గోవా గవర్నర్‌కు సమర్పించారు. మనోహర్ పారికర్ లా లక్ష్మీకాంత్ పర్సేకర్ జనాధరణ ఉన్న నేత కాకపోవడంతో పార్టీ ఓటమి పాలైందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 2012 ఎన్నికల్లో సాధారణ మోజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. మరో నాలుగు స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. పెర్నెమ్ నుంచి పోటీచేసిన అటవీ మంత్రి రాజేంద్ర అర్లేకర్.. ఎంజీపీ అభ్యర్థి అస్గాంకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా, కొత్తగా ఏర్పడిన గోవా ఫార్వర్డ్ పార్టీ బీజేపీకి డబుల్ ఝలక్ ఇచ్చింది.
జలవనరులశాఖ మంత్రి దయానంద్ మండ్రేకర్ గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్ధి వినోద్ పాలేకర్ చేతిలో, జయేశ్ సాల్గొంకార్ చేతిలో పర్యాటకశాఖ మంత్రి దిలీప్ పరులేకర్ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. షిరోదా నుంచి పోటీ చేసిన పరిశ్రమలశాఖ మంత్రి మహదేవ్ నాయక్ ను కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ షిరోద్కర్, ఇటీవల మంత్రి వర్గం నుంచి వైదొలగిన దిపాక్ ధవళికర్ స్వతంత్ర అభ్యర్థి గోవింద్ గవాడే చేతిలో ఓటమి పాలయ్యారు. ధవళికర్ పోటీ చేసిన ఎంజీపీ పార్టీ బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.