breaking news
CM Laxmikant Parsekar
-
సీఎం సహా ఆరుగురు మంత్రుల ఓటమి
పనాజి: గత నెలలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారీస్థాయిలో 83 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈ ఓటింగ్ బీజేపీకి ప్రతికూలంగా మారుతుందని ఆ పార్టీ నేతలు సైతం ఊహించి ఉండకపోవచ్చు. ఇటీవల నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు వస్తాయని, సొంతంగానే అధికారం చేపడుతుందని వచ్చింది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో రికార్డు స్థాయిలో కేబినెట్లో బీజేపీకి చెందిన 8 మంత్రులకు గానూ సీఎం సహా 6 మంది మంత్రులు ప్రత్యర్ధి కాంగ్రెస్, ఇతర పార్టీ నేతల చేతిలో ఓటమి పాలయ్యారు. గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్టే చేతిలో 7వేలకు పైగా ఓట్లతో ఓటమి చవిచూడటం బీజేపీపై ప్రజల విముఖతకు సంకేతాలిస్తోంది. ఓటమి అనంతరం లక్ష్మీకాంత్ పర్సేకర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గోవా గవర్నర్‌కు సమర్పించారు. మనోహర్ పారికర్ లా లక్ష్మీకాంత్ పర్సేకర్ జనాధరణ ఉన్న నేత కాకపోవడంతో పార్టీ ఓటమి పాలైందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 2012 ఎన్నికల్లో సాధారణ మోజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. మరో నాలుగు స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. పెర్నెమ్ నుంచి పోటీచేసిన అటవీ మంత్రి రాజేంద్ర అర్లేకర్.. ఎంజీపీ అభ్యర్థి అస్గాంకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా, కొత్తగా ఏర్పడిన గోవా ఫార్వర్డ్ పార్టీ బీజేపీకి డబుల్ ఝలక్ ఇచ్చింది. జలవనరులశాఖ మంత్రి దయానంద్ మండ్రేకర్ గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్ధి వినోద్ పాలేకర్ చేతిలో, జయేశ్ సాల్గొంకార్ చేతిలో పర్యాటకశాఖ మంత్రి దిలీప్ పరులేకర్ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. షిరోదా నుంచి పోటీ చేసిన పరిశ్రమలశాఖ మంత్రి మహదేవ్ నాయక్ ను కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ షిరోద్కర్, ఇటీవల మంత్రి వర్గం నుంచి వైదొలగిన దిపాక్ ధవళికర్ స్వతంత్ర అభ్యర్థి గోవింద్ గవాడే చేతిలో ఓటమి పాలయ్యారు. ధవళికర్ పోటీ చేసిన ఎంజీపీ పార్టీ బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీని రద్దు చేసే ప్రశ్నే లేదు
పణాజి: గోవా అసెంబ్లీని రద్దు చేసే అవకాశం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. మార్చి 11 వరకు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. గోవా అసెంబ్లీకి ఈ నెల 4న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 11న ఓటింగ్ జరుగుతుంది. కాగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరునెలలకు కనీసం ఒకసారైనా అసెంబ్లీ సమావేశం జరగాలి. గోవా అసెంబ్లీ సమావేశాలు చివరిసారిగా గతేడాది ఆగస్టు 26న జరిగాయి. కాబట్టి ఈ నెల 26వ తేదీలోపు మరోసారి అసెంబ్లీ సమావేశం కావాలి. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందును అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో గోవా అసెంబ్లీని రద్దు చేసే అవకాశముందని అభిప్రాయాలు రావడంతో సీఎం పర్సేకర్ స్పందించారు. కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నామని, అసెంబ్లీని రద్దు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. -
గోవాలో చీలుతున్న హిందూత్వ పార్టీలు
పనాజీ: గోవాలో పాలకపక్ష భారతీయ జనతా పార్టీ సంక్షోభ పరిస్థితులను కోరి తెచ్చుకుంటోంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మహారాష్ట్రావాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన సుధీన్ దవలీకర్, దీపక్ దవలీకర్లను మంత్రివర్గం నుంచి మంగళవారం తొలగించింది. రాష్ట్ర అసెంబ్లీలో ఎంజీపీకి మూడు సీట్లు ఉండగా, ఆ పార్టీ తరఫున ఈ ఇద్దరు సోదరులు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పరిసేకర్ను బహిరంగంగా విమర్శిస్తున్నారన్న కారణంగా దవలీకర్ సోదరులను బీజేపీ తొలగించింది. అయితే 2017లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే ఇప్పుడు తొలగించిన వారిని తిరిగి తీసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని లేకపోతే లేదని ఎంజీపీ పార్టీ బలంగా వాదిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి సర్దుబాటు కుదురుతుందని, మంత్రులను తొలగించాం గానీ పార్టీని దూరం చేసుకోవడం లేదని గోవా బీజేపీ వ్యవహారాలను చూస్తున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ చెబుతున్నారు. గోవాలో ఎంజీపీ ఒకప్పుడు బలంగా ఉన్న పార్టీ. పోర్చుగీస్ పాలన నుంచి గోవాను విముక్తం చేయడంలో కీలక పాత్ర వహించడంతో ప్రజల్లో బాగా బలపడింది. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ ఎదుగుదలతో క్రమంగా బలహీన పడుతూ వచ్చింది. అయినా ఇప్పటికీ ఈ పార్టీకి హిందూత్వ ఓటు చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఉంది. ఇటీవల కేంద్రంలోని ఆరెస్సెస్‌తో విడిపోయి స్వతంత్య్ర పార్టీగా ఆవిర్భవించిన సురక్షామంచ్ ఎంజీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రజల్లో మంచి పలుకుబడి కలిగిన సురక్షామంచ్ నాయకుడు సుభాష్ వెలింగ్కర్ ఇప్పటికే శివసేనతో పొత్తుపెట్టుకున్నారు. ఇంగ్లీషు మీడియం ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని నిరసిస్తూ స్కూల్ ప్రధానోపాధ్యాయుడైన సుభాష్ ఆరెస్సెస్‌తో బంధాన్ని తెంచుకొని సురక్షా మంచ్‌ను ఏర్పాటు చేశారు. 2012లో గోవాకు ప్రత్యేక హోదా కల్పిస్తానన్న హామీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో ‘యూ టర్న్ ప్రభుత్వం’ అంటూ విమర్శలు ఎదుర్కొంటోంది. మరోపక్క తాము అధికారంలోకి వస్తే గోవాకు ప్రత్యేక హోదాను తీసుకొస్తామని ఆప్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. దీనికి తోడు హిందూత్వ పార్టీలు విడిపోవడం మరో ప్రతికూల పరిణామం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిణామాలు బీజేపీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
గోవా సేఫ్.. ఫ్యాబ్ ఇండియా ఘటనలు అరకొరే
పనాజీ: గోవా పర్యాటకులకు ఎంతో సురక్షితమైన ప్రాంతమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. ఫ్యాబిండియాలాంటి సంఘటనలు ఎప్పుడోగానీ జరగవని చెప్పారు. ఫ్యాబ్ ఇండియా షోరూంలో షాపింగ్‌కు వెళ్లిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్రయల్ రూమ్ వద్ద ఓ నిఘా కెమెరాను గుర్తించిన విషయం తెలిసిందే. ఇది పెద్ద వివాదంకాగా, ఈ సంఘటనను తక్కువ చేస్తూ ముఖ్యమంత్రి పర్సేకర్ అది ఉద్దేశ పూర్వకంగా పెట్టిన కెమెరా కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో ధుమారం రేపుతుండటంతో ఆయన వివరణ ఇచ్చారు. ''సీసీ టీవీ కెమెరాలు షోరూమ్‌లోని ట్రయల్ రూం లోపల పెట్టలేదు. బయటిపక్కే ఉంది. అంటే అది ఉద్దేశ పూర్వకంగా పెట్టినది కాదనే నా అభిప్రాయం' అని మీడియాకు చెప్పారు. కేవలం స్మృతి చెప్పారని మాత్రమే ఈ విషయంలో మేం తీవ్రంగా స్పందించలేదని, ఒక సాధారణ మహిళ ఫిర్యాదు చేసినా అంతే వేగంతో స్పందిస్తామని, చర్యలు తీసుకుంటామని అన్నారు. దయచేసి పర్యాటకులు ఎవరూ ఇలాంటి వదంతులు నమ్మవద్దని గోవా సురక్షిత నగరం అని చెప్పారు. మీడియా కూడా గోవా ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నం చేస్తుందని తానెప్పుడూ అనబోనని వివరించారు. ఫ్యాబ్ ఇండియా షోరూంలాంటి ఘటనలో పదివేలలో ఒక్కటి ఉండొచ్చని చెప్పారు.