
గోవా సేఫ్.. ఫ్యాబ్ ఇండియా ఘటనలు అరకొరే
పనాజీ: గోవా పర్యాటకులకు ఎంతో సురక్షితమైన ప్రాంతమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. ఫ్యాబిండియాలాంటి సంఘటనలు ఎప్పుడోగానీ జరగవని చెప్పారు.
పనాజీ: గోవా పర్యాటకులకు ఎంతో సురక్షితమైన ప్రాంతమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. ఫ్యాబిండియాలాంటి సంఘటనలు ఎప్పుడోగానీ జరగవని చెప్పారు. ఫ్యాబ్ ఇండియా షోరూంలో షాపింగ్కు వెళ్లిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్రయల్ రూమ్ వద్ద ఓ నిఘా కెమెరాను గుర్తించిన విషయం తెలిసిందే. ఇది పెద్ద వివాదంకాగా, ఈ సంఘటనను తక్కువ చేస్తూ ముఖ్యమంత్రి పర్సేకర్ అది ఉద్దేశ పూర్వకంగా పెట్టిన కెమెరా కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో ధుమారం రేపుతుండటంతో ఆయన వివరణ ఇచ్చారు.
''సీసీ టీవీ కెమెరాలు షోరూమ్లోని ట్రయల్ రూం లోపల పెట్టలేదు. బయటిపక్కే ఉంది. అంటే అది ఉద్దేశ పూర్వకంగా పెట్టినది కాదనే నా అభిప్రాయం' అని మీడియాకు చెప్పారు. కేవలం స్మృతి చెప్పారని మాత్రమే ఈ విషయంలో మేం తీవ్రంగా స్పందించలేదని, ఒక సాధారణ మహిళ ఫిర్యాదు చేసినా అంతే వేగంతో స్పందిస్తామని, చర్యలు తీసుకుంటామని అన్నారు. దయచేసి పర్యాటకులు ఎవరూ ఇలాంటి వదంతులు నమ్మవద్దని గోవా సురక్షిత నగరం అని చెప్పారు. మీడియా కూడా గోవా ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నం చేస్తుందని తానెప్పుడూ అనబోనని వివరించారు. ఫ్యాబ్ ఇండియా షోరూంలాంటి ఘటనలో పదివేలలో ఒక్కటి ఉండొచ్చని చెప్పారు.