గోవాలో పాలకపక్ష భారతీయ జనతా పార్టీ సంక్షోభ పరిస్థితులను కోరి తెచ్చుకుంటోంది.
పనాజీ: గోవాలో పాలకపక్ష భారతీయ జనతా పార్టీ సంక్షోభ పరిస్థితులను కోరి తెచ్చుకుంటోంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మహారాష్ట్రావాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన సుధీన్ దవలీకర్, దీపక్ దవలీకర్‌లను మంత్రివర్గం నుంచి మంగళవారం తొలగించింది. రాష్ట్ర అసెంబ్లీలో ఎంజీపీకి మూడు సీట్లు ఉండగా, ఆ పార్టీ తరఫున ఈ ఇద్దరు సోదరులు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పరిసేకర్‌ను బహిరంగంగా విమర్శిస్తున్నారన్న కారణంగా దవలీకర్ సోదరులను బీజేపీ తొలగించింది. అయితే 2017లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే ఇప్పుడు తొలగించిన వారిని తిరిగి తీసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని లేకపోతే లేదని ఎంజీపీ పార్టీ బలంగా వాదిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి సర్దుబాటు కుదురుతుందని, మంత్రులను తొలగించాం గానీ పార్టీని దూరం చేసుకోవడం లేదని గోవా బీజేపీ వ్యవహారాలను చూస్తున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ చెబుతున్నారు.
గోవాలో ఎంజీపీ ఒకప్పుడు బలంగా ఉన్న పార్టీ. పోర్చుగీస్ పాలన నుంచి గోవాను విముక్తం చేయడంలో కీలక పాత్ర వహించడంతో ప్రజల్లో బాగా బలపడింది. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ ఎదుగుదలతో క్రమంగా బలహీన పడుతూ వచ్చింది. అయినా ఇప్పటికీ ఈ పార్టీకి హిందూత్వ ఓటు చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఉంది. ఇటీవల కేంద్రంలోని ఆరెస్సెస్‌తో విడిపోయి స్వతంత్య్ర పార్టీగా ఆవిర్భవించిన సురక్షామంచ్ ఎంజీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రజల్లో మంచి పలుకుబడి కలిగిన సురక్షామంచ్ నాయకుడు సుభాష్ వెలింగ్‌కర్ ఇప్పటికే శివసేనతో పొత్తుపెట్టుకున్నారు. ఇంగ్లీషు మీడియం ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని నిరసిస్తూ స్కూల్ ప్రధానోపాధ్యాయుడైన సుభాష్ ఆరెస్సెస్‌తో బంధాన్ని తెంచుకొని సురక్షా మంచ్‌ను ఏర్పాటు చేశారు.
2012లో గోవాకు ప్రత్యేక హోదా కల్పిస్తానన్న హామీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో ‘యూ టర్న్ ప్రభుత్వం’ అంటూ విమర్శలు ఎదుర్కొంటోంది. మరోపక్క తాము అధికారంలోకి వస్తే గోవాకు ప్రత్యేక హోదాను తీసుకొస్తామని ఆప్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. దీనికి తోడు హిందూత్వ పార్టీలు విడిపోవడం మరో ప్రతికూల పరిణామం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిణామాలు బీజేపీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.