ట్రెండింగ్‌ : గో బ్యాక్‌ మోదీ..

Go Back PM Modi Hashtag Trending On Twitter Against PM Tamil Nadu Tour - Sakshi

ప్రధాని మోదీకి ట్విటర్‌లో నిరసన సెగ

సాక్షి, న్యూఢిల్లీ : మదురైలో ఏయిమ్స్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం తమిళనాడు వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విటర్‌లో నిరసన సెగ తగిలింది. గోబ్యాక్‌ మోదీ హాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. మోదీ తమిళనాడు పర్యటనను రెండు లక్షలకు పైగా ట్విటర్‌ ఖాతాదారులు తిరస్కరిస్తుండగా.. ఆయనకు వెల్‌కం చెబుత్ను వారి సంఖ్య కేవలం 30 వేల మందే ఉండడం గమనార్హం. ఇంకా కొంతమంది ఏకంగా ద్రవిడ ఉద్యమ నిర్మాత, హేతువాది పెరియార్‌ రామస్వామి మోదీని బయటకు నెట్టేసే కార్టూన్‌ను కూడా జతచేస్తున్నారు. తమిళనాడుపై గజ తుపాన్‌ విరుచుకుపడగా కేంద్రం సాయమందించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకనే ప్రధాని పర్యటనపట్ల నిరసన తెలుపుతున్నామని చెప్తున్నారు.  

ఇదిలాఉండగా..గత నవంబర్‌లో గజ తుపాను ధాటికి తమిళనాడు విలవిల్లాడింది. దాదాపు 59 మంది మృత్యువాత పడగా 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం సంభవించింది.  ఇక మధురైలో ఏయిమ్స్‌ ఏర్పాటు చేస్తుండడం పట్ల వేలాది మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధురై థాంక్స్‌ మోదీ హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. టీఎన్‌ వెల్‌కం మోదీ మోదీ హ్యాష్‌ ట్యాగ్‌తో తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. 

ఏయిమ్స్‌తో పాటు మధురై రాజాజీ మెడికల్‌ ఆస్పత్రి, తంజావూరు మెడికల్‌ ఆస్పత్రి, తిరునర్వేలి మెడికల్‌ ఆస్పత్రిల్లో సూపర్‌ స్పెషాలిటీ హస్పిటల్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి కేరళకు వెళ్లనున్నారు. మోదీకి రాకకు వ్యతిరేకంగా ట్రెండ్‌ అవుతున్న హ్యాష్‌టాగ్‌కు తమ పార్టీకి ఏ సంబంధం లేదని డీఎంకే ఐటీ సెల్‌ చీఫ్‌ పి.త్యాగరాజన్‌ స్పష్టం చేశారు. బీజేపీ ఐటీ సెల్‌ మాదిరిగా తాము చేయబోమని అన్నారు. కాగా, మోదీ గో బ్యాక్‌ హ్యాష్ ట్యాగ్‌ గతంలో కూడా ఓసారి ట్రెండ్‌ అయింది. గతేడాది ఏప్రిల్‌లో డిఫెన్స్‌ ఎక్స్‌పో సందర్శించడానికి మోదీ తమిళనాడుకు వెళ్లిన సందర్బంలో ఇది జరిగింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top