
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కన్నమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బిహార్‌కు ఆయన మూడు దఫాలు సీఎంగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన బిహార్ పశుదాణా కుంభకోణంలో జగన్నాథ్ మిశ్రా కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాంచీ కోర్టు ఆయనను ఇటీవల నిర్ధోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖలు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఆయనకు నివాళిగా బిహార్ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.
ఏపీ గవర్నర్ సంతాపం..
సాక్షి, అమరావతి : బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిహార్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. మిశ్రా కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
వైఎస్ జగన్ సంతాపం..
బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. మిశ్రా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ ఒక ప్రకటనలో తెలిపారు.