లోకాన్ని చూపిన ఐదేళ్ళ ఐశ్వర్య... | Five-year-old girl gifts vision to two after death | Sakshi
Sakshi News home page

లోకాన్ని చూపిన ఐదేళ్ళ ఐశ్వర్య...

Aug 31 2016 3:55 PM | Updated on Mar 28 2019 6:14 PM

లోకాన్ని చూపిన ఐదేళ్ళ ఐశ్వర్య... - Sakshi

లోకాన్ని చూపిన ఐదేళ్ళ ఐశ్వర్య...

ఐదేళ్ళ చిన్నారి.. ప్రమాదవశాత్తు చనిపోయింది. కానీ ఆమె కళ్ళు మాత్రం ఇద్దరు వ్యక్తులకు జీవితంలో వెలుగును నింపాయి.

మథురః ఐదేళ్ళ ఆ చిన్నారి.. ప్రమాదవశాత్తు చనిపోయింది. కానీ ఆమె కళ్ళు మాత్రం ఇద్దరు వ్యక్తులకు జీవితంలో వెలుగును నింపాయి. యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన ఆమెకు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. చివరి క్షణాల్లో ఆ చిన్నారి కోరికను మన్నించిన తల్లిదండ్రులు.. ఆమె మరణానంతరం తీర్చారు. ఆమె కళ్ళను ఇద్దరు వ్యక్తులకు దానం చేసి, వారి జీవితాల్లో కాంతులు నింపారు.

అన్ని దానాలకంటే నేత్ర దానం ఎంతో గొప్పదని చెప్తారు. కొద్ది క్షణాలపాటు కళ్ళుమూసుకుంటే  చీకటిని భరించలేని పరిస్థితిలో.. జీవితాంతం లోకాన్ని చూడలేని అంథులకు చూపునివ్వడం అంటే వారి జీవితంలో కాంతిని నింపినట్లే. మథుర జిల్లాకు చెందిన 5 ఏళ్ళ ఐశ్వర్య ఆగస్టు 23న ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న స్కూల్ వ్యాన్ ను.. స్థానిక మున్సిపాలిటీ గార్బేజ్ వ్యాను ఢీకొట్టడంతో ఐశ్వర్య కు తీవ్రంగా గాయాలై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. దీంతో ఆమెకు తక్షణ వైద్యం అందించిన డాక్టర్లు, అనంతరం ఢిల్లీకి తరలించమని సూచించారు. రాజధానిలోని ఆర్ ఎం ఎల్ ఆస్పత్రిలో ఐశ్వర్యకు చికిత్స చేశారు. కానీ ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.

మా బిడ్డ చనిపోయేముందు తన కళ్ళను దానం చేయాలనుకుంటున్నట్లు చెప్పిందని ఐశ్వర్య తండ్రి లక్ష్మీనారాయణ తెలిపారు. ఆమె కోరిక మేరకు ఎయిమ్స్ (ఏఐఐఎంఎస్) కు చేరుకుని, ఇద్దరు వ్యక్తులకు  కళ్ళను దానం చేశారు. కార్నియా మార్పిడి ఆపరేషన్ కు  ఆరు గంటలు పట్టింది. ఇద్దరు వ్యక్తులకు కంటిచూపు లభించింది. తమ బిడ్డ ఎడబాటు తీరని బాధను మిగిల్చినా... ఆమె వల్ల ఇద్దరికి కంటిచూపు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఐశ్వర్య తల్లిదండ్రులు చెప్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement