కార్యకర్తల అత్యుత్సాహం.. రాహుల్‌కు తప్పిన ప్రమాదం

Fire Incident Took Place At Rahul Gandhi Madhya Pradesh Rally - Sakshi

భోపాల్‌ : కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ ఆదివారం(నిన్న) జబల్‌పూర్‌లో 8 కిలోమీటర్ల భారీ రోడ్‌షో నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది కార్యకర్తలు మూడు రంగుల బెలూన్లతో రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ముందుకొచ్చారు. అదే సమయంలో మరికొందరు కార్యకర్తలు యువనేతకు హారతి ఇవ్వడానికి ముందుకొచ్చారు.

దాంతో హారతి మంట బెలూన్లకు తాకేసరికి వాటిలో ఉన్న నైట్రోజన్ వాయువు అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, కొద్ది సెకండ్లలోనే గ్యాస్ అయిపోవడంతో మంటలు ఆరిపోయాయి. కానీ మంటలను చూసి అక్కడకు వచ్చినవారంతా భయంతో పరుగులు తీశారు. వాహనం మీద ఉన్న రాహుల్ గాంధీ కూడా ఒక్కసారిగా మంటను చూసి భయపడి ఓ పక్కకు జరిగారు. అయితే ఆ మంటలు ఆయన వరకు రాకుండానే ఆగిపోయాయి. ఈ సమయంలో రాహుల్‌ గాంధీతో పాటు జ్యోతిరాదిత్య సిందియా, కమల్‌నాథ్ కూడా ఉన్నారు.

కాగా, భద్రతా లోపం వల్లే మంటలు చెలరేగాయంటూ వస్తోన్న ఆరోపణలను జబల్‌పూర్ ఎస్పీ అమిత్ సింగ్ ఖండించారు. ర్యాలీలో భాగంగా వాహనానికి, కార్యకర్తలకు మధ్య కనీసం15 మీటర్ల దూరం కొనసాగించామని తెలిపారు. అంతేకాక హారతి ఇవ్వడానికి వచ్చిన వారు కూడా కాంగ్రెస్‌ కార్యకర్తలేనని ఆయన గుర్తుచేశారు. దేశంలోనే అత్యంత భద్రత కలిగిన అతి కొద్దిమంది నాయకులలో రాహుల్‌గాంధీ ఒకరు. కానీ ఇప్పటికే ఆయనకు భద్రత కల్పించే విషయంలో పలు సందర్భాలలో అపశృతులు దొర్లాయి.

గతంలో రాహుల్‌ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. విమానం ఒక పక్కకు ఒరిగిపోయింది. వాతావరణం అంతా బాగానే ఉన్నా, కావాలనే ఇలా చేశారని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆరోపించింది. గుజరాత్‌లో కొందరు తనపై రాళ్లు విసిరారని రాహుల్ పార్లమెంటులో ప్రస్తావించారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు పదే పదే భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. గడిచిన రెండేళ్లలో కనీసం వంద సార్లు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడలేదని, విదేశాలకు వెళ్లినపుడల్లా చిట్టచివరి నిమిషంలో ఎస్‌పీజీకి చెబుతారని, దాంతో అధికారులకు అది సమస్యగా మారుతోందని అన్నారు.

2016, 17 సంవత్సరాలలో రాహుల్‌గాంధీ ఆరు సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లి 72 రోజులు గడిపారని, ఒక్కసారి కూడా ఎస్పీజీ అధికారులను వెంట తీసుకెళ్లలేదని రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో సమాధానమిచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top