కొడిగట్టిన బతుకు దీపాలు

fire accident in odisha - Sakshi

రాష్ట్రంలో బాణసంచా పేలుళ్లు

మూడు ప్రాంతాల్లో  10 మంది దుర్మరణం

పలువురికి గాయాలు

రౌర్కెలాలో రూ.1 కోటి ఆస్తినష్టం

45 దుకాణాలు దగ్ధం

18 మోటారు సైకిళ్లు బూడిదపాలు

హిందువుల ప్రధాన పండగ దీపావళికి ఒకరోజు ముందే బాణ సంచా పేలుళ్లతో రాష్ట్రమంతా దద్దరిల్లింది. దీంతో గగనమంతా పొగలు కమ్మి పదిమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆనందంగా దీపావళి పండగను చేసుకుని కుటుంబం లోని చీకట్లను పారదోలి సుఖ సంతోషాలతో వర్దిల్లాలని భావించిన ఆ కుటుంబాల్లో పెను విషాదం నిండిపోయింది. ప్రమాదాల్లో పలువురు తీవ్రగాయాల పాలవగా రౌర్కెలాలో  సుమారు కోటి రూపాయల ఆస్తినష్టం సంభవించింది.  

భువనేశ్వర్‌/బాలేశ్వర్‌/రౌర్కెలా/పిప్పిలి: రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం సంభవించిన బాణసంచా పేలుళ్లలో   10 మంది దుర్మరణం పాలయ్యారు. బుధవారం వేకువ జాము నుంచి మధ్యాహ్నం లోగా ఈ సంఘటనలు వేర్వేరు సమయాల్లో సంభవించాయి. ఈ ప్రమాదాల్లో బాలేశ్వర్‌ జిల్లాలో అత్యధికంగా 8 మంది ప్రాణాలు కోల్పోగా రౌర్కెలా, పిప్పిలి ప్రాంతాల్లో ఒక్కొక్కరు  దుర్మరణం చెందారు. బాలేశ్వర్‌ జిల్లాలోని  బహాబొలొపూర్‌ గ్రామానికి చెందిన గోలక్‌ ప్రధాన్‌ ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా మధ్యాహ్నం  అకస్మాత్తుగా నిప్పు రవ్వలు రేగడంతో పేలుడు సంభవించింది. దీంతో పక్కనే ఉన్న బాణసంచా గొడౌన్‌కు నిప్పు అంటుకోవడంతో ప్రమాదం మరింత తీవ్రమైంది.

బాణసంచా తయారీ ప్రాంగణానికి ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు చేరడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ప్రమాదంలో మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారంతా బాలేశ్వర్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ çసంఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాద సంఘటనలో మృతుల కుటుంబీకులకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన బాధితుల చికిత్స కోసం రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. 

పిప్పిలిలో బాలిక మృతి
పూరీ జిల్లా పిప్పిలి సమితి బలిపడా గ్రామంలో బాణసంచా  పేలుడుతో ఓ బాలిక  మరణించింది. మృతురాలిని  గ్రామానికి చెందిన ప్రజ్ఞారాణి బెహరాగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం స్థానిక క్యాపిటల్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికీ వారి  పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించినట్లు క్యాపిటల్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ చిత్తరంజన్‌ దాస్‌ తెలిపారు. బాధితుల శరీరం 80 శాతం పైబడి కాలిపోయినట్లు ఆయన వివరించారు. గాయపడిన వారిలో అమిత్‌ బెహరా, సిద్ధాంత్‌ బెహరా, టుల్లు బెహరా, రేష్మా బెహరా ఉన్నట్లు పేర్కొన్నారు. 

రౌర్కెలాలో ఒకరు 
రౌర్కెలా పవర్‌ హౌస్‌ రోడ్డు ప్రాంతంలోని అగ్నిమాపక కార్యాలయం చేరువలో మంగళవారం అర్ధరాత్రి 2.35 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బాణసంచా దుకాణం పూర్తిగా దగ్ధమైంది.    ఈ విషాద సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. 45 బాణసంచా  దుకాణాలు దగ్ధమయ్యాయి. 18 మోటార్‌ సైకిళ్లు బూడిదపాలయ్యాయి. 1 ట్రాలర్‌ కూడా కాలిపోయింది. ఇలా దాదాపు రూ.1 కోటి వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు  ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో మరణించిన వ్యక్తిని విశ్వజిత్‌ జెనాగా గుర్తించారు. 
           
ఇదే ప్రమాదంలో మరోవ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని రౌర్కెలా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఆకస్మిక అగ్ని ప్రమాదం సంభవించిన సమాచారం అందిన మరుక్షణమే అగ్ని మాపక దళాల్ని రంగంలోకి దింపినట్లు రౌర్కెలా డీఎస్పీ ప్రద్యుమ్న కుమార్‌ మిశ్రా తెలిపారు. 9 యూనిట్ల అగ్ని మాపక దళాలు కొన్ని గంటలపాటు నిరవధికంగా శ్రమించి మంటల్ని నివారించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6 యూనిట్లు, రౌర్కెలా స్టీల్‌ప్లాంట్‌ నుంచి 3 యూనిట్ల అగ్ని మాపక దళాలు శ్రమించాయి. అందుబాటులో ఉన్న పోలీసుల్ని నియమించి భద్రతా వలయం ఏర్పాటు చేశారు. చేరువలో ఉన్న బారులు తీరిన వందలాది ట్రక్కుల్ని ముందు జాగ్రత్త చర్యగా దూరంగా రవాణా చేయించారు. అగ్ని కీలలు విస్తరించకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో భారీ నష్టాన్ని నియంత్రిచండం సాధ్యమైనట్లు డీఎస్పీ వివరించారు.

మార్కెట్‌ నడి బొడ్డులో పార్కింగ్‌ చేసిన వాహనాల్ని బయటకు తీసేందుకు వీలు కాని పరిస్థితుల్లో అవన్నీ బూడిదపాలయ్యాయి. నగరంలో పలు చోట్ల 200 పైబడి బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణాల్లో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.  అగ్ని మాపక వ్యవస్థ ప్రమాదాల నివారణ కోసం ఏర్పాట్లపై కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తోంది. ఈ ప్రమాదంలో విద్యుత్‌ తీగలు తెగి నేలపై పడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.  ఈ ప్రమాదాన్ని ప్రేరేపించిన పరిస్థితులు, కారణాల్ని ధ్రువీకరించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు  డీఎస్పీ ప్రద్యుమ్న కుమార్‌ మిశ్రా తెలిపారు. రౌర్కెలా తహసీల్దార్, సబ్‌–కలెక్టర్‌ ఘటనా స్థలాన్ని ప్రత్యక్షంగా సందర్శించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top