‘కొడనాడు’ దోపిడీ వెనుక పళనిస్వామి!

Edappadi Palaniswami rejects allegations against kodanad robbery - Sakshi

కీలక పత్రాల కోసమే హత్య

తెహల్కా మాజీ సంపాదకుడు మాథ్యూస్‌ ఆరోపణలు

సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌ దోపిడీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎస్టేట్‌లోని కీలక పత్రాలు, వీడియోల కోసమే ఈ దోపిడీ, హత్యలు జరిగాయని తెహల్కా పత్రిక మాజీ సంపాదకుడు మాథ్యూస్‌ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తమిళనాడు  సీఎం పళనిస్వామి ఉన్నారని బాంబు పేల్చారు. జయలలిత విశ్రాంతి కోసం తరచూ ఈ ఎస్టేట్‌కు వచ్చేవారు. అలాంటి సందర్భాల్లో కొడనాడు ఎస్టేట్‌ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేవారు. అయితే జయలలిత చనిపోయాక 2017 ఏప్రిల్‌ 24న ఇక్కడ దోపిడీ జరిగింది. ఈ ఘటనలో వాచ్‌మెన్‌ ఓం బహదూర్‌ దారుణ హత్యకు గురికాగా, కృష్ణబహదూర్‌ అనే మరో వాచ్‌మెన్‌ గాయాలతో బయటపడ్డాడు. అప్పట్లో నగల కోసమే దొంగతనం జరిగిందని వార్తలొచ్చాయి.  

క్షమాపణ చెప్పే వీడియోలు..
అన్నాడీఎంకే వర్గాలను తన గుప్పెట్లో ఉంచుకునే రీతిలో జయలలిత కొన్ని కీలక రికార్డులను ఆ ఎస్టేట్‌లో దాచి ఉంచారని, తప్పు చేసిన పార్టీ నేతలు జయలలిత కాళ్లపై పడి క్షమించమని వేడుకునే వీడియోలు ఎస్టేట్‌లో ఉండేవని మాథ్యూస్‌ తెలిపారు.  ఈ వీడియోలతో పాటు మరికొన్ని రికార్డుల కోసమే దోపిడీ జరిగిందని ఈ కేసులో నిందితుడు షయాన్‌ చెప్పాడు. జయలలిత ఆసుపత్రిలో ఉండగానే దోపిడీకి ప్రణాళిక రచించామనీ, పళనిస్వామి సీఎం అయ్యాక అది వీలైందన్నారు.

ప్రభుత్వాన్ని కూల్చే నాటకం: సీఎం
జయ పేరుకు కళంకం తీసుకురావడమే కాకుండా తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొత్త నాటకం మొదలైందని సీఎం ఆరోపించారు. ఈ విషయాన్ని ఇన్నిరోజులు నిందితులు కోర్టుకు ఎందుకు చెప్పలేదని పళనిస్వామి ప్రశ్నించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top