కేరళకు పాకిన కరోనా?

Coronavirus, One in Kochi under suspicion, hospitalised - Sakshi

కొచ్చి: చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనా వుహాన్ నగరం నుంచి వచ్చిన కొచ్చికి చెందిన ఒక యువకుడు తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం కలకలం రేపుతోంది. ప్రాణాంతకమైన నిపా వైరస్‌తో ఇబ్బందులు పాలైన కేరళవాసుల్లో   తాజాగా కరోనా మహమ్మారి మరింత గుబులు రేపుతోంది.

ఇటీవల చైనానుంచి తిరిగి వచ్చిన యువకుడు, కరోనా వైరస్‌ బాగా వ్యాపించడం, ప్రపంచవ్యాప్తంగా అలర్ట్‌ జారీ చేయడంతో అనారోగ్యంతో ఉన్న అతను తొలుత ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడిని సంప్రదించాడు.  కరోనా వైరస్‌ను పోలిన అనునామానాస్పద లక్షణాలు కనిపించడంతో ఆ తరువాత అతడిని కలమసేరి వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  అతనికి కరోనా వైరస్‌ సోకినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎర్నాకుళం అదనపు జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థి శరీర ద్రవాల నమూనాలను పరీక్షల కోసం పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టుతెలిపారు.  మరోవైపు చైనా నుండి తిరిగి వచ్చిన ఎట్టుమన్నూర్ కు చెందిన మరో  విద్యార్థినికి కూడా కరోనా సోకిందనే ఆందోళన చెలరేగింది. అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే వుందని, డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉందని  వైద్యులు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వున్నామని జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. 

మరోవైపు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కఠినమైన స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చైనానుంచి వచ్చిన వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫ్లూ లాంటి లక్షణాలు ఏమాత్రం కనిపించినా వారిని హుటా హుటిన ఎర్నాకుళం ఆసుపత్రికి తరలించి సంబంధిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు చైనానుంచి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టుగా అనుమానాలు వ్యక్తమైనాయి. ప్రస్తుతం వీరు చిన్చ్‌పోకలిలోని కస్తూర్బా సివిల్‌ ఆసుపత్రిలో  వైద్యుల పర్యవేక్షణలో  వున్నారు.  అయితే  ప్రమాదకరమైన వైరస్‌కి సంబందించి ఎలాంటి కేసు నమోదు కాలేదని ముంబై వైద్యులు తెలిపారు.

జనవరి 24 నాటికి, 96 విమానాల ద్వారా వచ్చిన 20,844 మంది ప్రయాణికులకు కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ చేశామని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఒక్కరోజే 19 విమానాలలో వచ్చిన 4082 మందిని పరీక్షించామని, ఇప్పటివరకు కరోనా వైరస్‌కు సంబంధించి ఎలాంటి కేసు నమోదుకాలేదని  తెలిపింది. అయితే, ముగ్గురిని పరిశీలనలో ఉంచినట్టు  తాజాగా ప్రకటించింది. 

 చదవండి : ‘కరోనా’ బారిన తొలి భారతీయురాలు 
అచ్చం ఆ సినిమా తరహాలోనే చనిపోతున్నారు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top