షాపులోకి చొరబడి పోలీసుల అరాచకం! | Cops Broke My Shop In Seelampur Says Travel Agent In Delhi | Sakshi
Sakshi News home page

అన్యాయంగా షాపును ధ్వంసం చేసిన పోలీసులు

Dec 18 2019 5:41 PM | Updated on Dec 18 2019 6:24 PM

Cops Broke My Shop In Seelampur Says Travel Agent In Delhi - Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ)కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలు చోట్ల కర్ఫ్యూ విధించినప్పటికీ పరిస్థితుల్లో ఆశించదగ్గ మార్పు కనిపించలేదు. నిరసనలు హింసాత్మకంగా మారడానికి పోలీసుల వైఖరి కూడా ప్రధాన కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి ఊతమిచ్చే ఘటన తూర్పు ఢిల్లీలోని సీలంపూర్‌లో చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా సోమవారంనాడు సీలంపూర్‌ వాసులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని దుకాణాలను మూసివేయాలని హెచ్చరించారు. దీంతో అనిస్‌ మాలిక్‌ అనే వ్యక్తి హడావుడిగా తన షాపును మూసేశాడు. కానీ తాళం వేయడం మర్చిపోయాడు.

అదే అతను చేసిన పొరపాటని అతనికి తర్వాత అర్థమైంది. నిరసనల రగడలో పోలీసులు అతని షాపును తెరిచి ఇష్టం వచ్చినట్టుగా అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డు ఐంది. దీంతో ఆ దృశ్యాల ఆధారంగా షాపు యజమాని అనిస్‌మాలిక్‌ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అన్యాయంగా తన దుకాణంపై దాడి చేశారని వాపోయాడు. దుకాణం అద్దాలు పగలగొట్టారని, కంప్యూటర్లు ధ్వంసం చేశారని, ఫోన్లు వంటి పలు విలువైన వస్తువులను విరగ్గొట్టారని పోలీసులకు తెలిపాడు. ఇక ఈ వీడియోలో పోలీసులు ఇద్దరిని చితకబాదారని పేర్కొన్నాడు. కానీ వాళ్లు నిరసనకారులు కాదని, ఓ దుకాణంలో పనిచేసేవాళ్లని స్పష్టం చేశాడు. తన షాపును ధ్వంసం చేసినందుకుగానూ నష్ట పరిహారం ఇప్పించాలని పోలీసులను కోరాడు.
పౌరసత్వ రగడ; సుప్రీంలో కేంద్రానికి ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement