ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సర్వీసుల్లో చేరకుండా ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) విద్యార్థులను అడ్డుకునేందుకే క్రీమీలేయర్ విధానాన్ని ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సర్వీసుల్లో చేరకుండా ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) విద్యార్థులను అడ్డుకునేందుకే క్రీమీలేయర్ విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోందంటూ ఆర్జేడీ, ఎస్పీ సభ్యులు సోమవారం లోక్‌సభలో ధ్వజమెత్తారు. జీరో అవర్‌లో సభలో ఈ అంశాన్ని జైప్రకాశ్ నారాయణ్ యాదవ్(ఆర్జేడీ) లేవనెత్తారు. 7వ వేతన సంఘ సిఫారసుల అమలు అనంతరం.. కిందిస్థాయి ప్రభుత్వోద్యోగుల పిల్లలు సివిల్ సర్వీసెస్ సాధించకుండా క్రీమీలేయర్ విధానంలోని ఆదాయ నిబంధన అడ్డంకులు సృష్టించే అవకాశముందని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఈ వాదనను కేంద్రం తిప్పికొట్టింది. క్రీమీలేయర్ విధానం యూపీఏ అధికారంలో ఉన్న 2004 నుంచే అమల్లో ఉందని, తామూ దాన్నే అనుసరిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ వివరించారు. కోర్టు కేసుల నుంచి అభ్యర్థులను తప్పించేందుకే వారి నుంచి ఆదాయ సమాచారం తీసుకుంటున్నామని హోంమంత్రి రాజ్‌నాథ్ వివరణ ఇచ్చారు.