కాంగ్రెస్‌లో ఓటమి భయం! | Congress and the fear of defeat! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ఓటమి భయం!

May 13 2014 1:15 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌లో ఓటమి భయం! - Sakshi

కాంగ్రెస్‌లో ఓటమి భయం!

కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు తప్పవన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఈ విషయంలో రాహుల్‌గాంధీని విమర్శల తాకిడి నుంచి కాపాడే చర్యలకు కాంగ్రెస్ అప్పుడే శ్రీకారం చుట్టింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో రాహుల్‌ను రక్షించే యత్నం
ఫలితాలు ఎలా ఉన్నా సమష్టి బాధ్యతంటూ ప్రకటన

 
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు తప్పవన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఈ విషయంలో రాహుల్‌గాంధీని విమర్శల తాకిడి నుంచి కాపాడే చర్యలకు కాంగ్రెస్ అప్పుడే శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఫలితాలు ఎలా ఉన్నా అది సమష్టి బాధ్యతంటూ పార్టీ ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్‌అహ్మద్ సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... రాహుల్ ప్రభుత్వంలో లేరని, పార్టీలో రెండో స్థానంలో ఉన్నారని చెప్పారు. సోనియా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారని, స్థానికంగా నాయకత్వాలు ఉన్నాయని, కనుక ఇదంతా సమష్టి బాధ్యతగా చెప్పారు. ఫలితాలు అంచనా వేసినట్లుగా లేకపోతే, ఎన్నికల్లో పార్టీని నడిపించిన రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుంటారా? లేక పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా ఆ బాధ్యత తీసుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌ను అహ్మద్ కొట్టేశారు. 2004, 2009లో ఈ పోల్స్ తప్పని రుజువయ్యాయని, 16న వెలువడే ఫలితాల కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.  

 ఫలితాలపై సోనియా సమీక్ష

 ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జీలతో  సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం ఆరుగంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు సోనియా నివాసంలో ఈ భేటీ కొనసాగింది.వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, గెలుపోటములకు సంబంధించి సభ్యుల నుంచి సోనియా వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించినట్టు సమాచారం. సమావేశంలో కాంగ్రెస్ కోర్‌కమిటీ సభ్యులు అహ్మద్‌పటేల్, జనార్ధన్ ద్వివేదీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, అజయ్‌మాకెన్, షకీల్ అహ్మద్, వాయిలార్వ్రి, రాజీవ్‌శుక్లా, ముకుల్ వాస్నిక్ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement