బుల్లెట్‌ గాయంతో కశ్మీర్‌లో బాలుడు మృతి..!!

Class 11 Boy Died With Pellet Injury While Protest In Kashmir - Sakshi

ఆరోపణల్ని కొట్టిపడేసిన ఆర్మీ

శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కేంద్రం భారీ ఎత్తున బలగాలను మోహరించింది. టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసింది. స్కూళ్లకు తాత్కాలిక సెలవు ప్రకటించింది. కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రకటిస్తూ వచ్చిన కేంద్రం.. ఇటీవల అక్కడ ఆంక్షలు సడలించింది. అయితే, బయటికి తెలియని ఘోరాలు అక్కడ చోటుచేసుకున్నాయని పలు ఆరోపణలొస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వెలుగు చూసిన ఓ వార్త పలు సందేహాలు లేవనెత్తింది.

భద్రతా బలగాల కాల్పుల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలుడు కన్నుమూశాడని సీఎన్‌ఎన్‌ వార్త సంస్థ వెల్లడించింది. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌, లఢక్‌ ప్రాంతాలుగా రాష్ట్ర విభజన నిర్ణయాలతో సౌరా ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయని తెలిపింది. నెల రోజుల క్రితం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇంటర్‌ మొదటి చదువుతున్న బాలుడి కంట్లో బుల్లెట్‌ దూసుకుపోయిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచాడని రాసుకొచ్చింది. కాగా, ఈ ఆరోపణల్ని ఆర్మీ అధికారులు కొట్టిపడేశారు. రాళ్లదాడిలో గాయపడటంతోనే సదరు బాలుడు చనిపోయాడని లెఫ్టినెంట్‌ జనరల్‌ దిల్లాన్‌ స్పష్టం చేశారు.

‘కుర్రాడి చావుకు బుల్లెట్‌ గాయం కారణం కాదు. అతను రాళ్లదాడిలో గాయపడి ప్రాణాలొదిలాడు. రాళ్లదాడితో ఎవరు ఎవరి చావుకు కారణమౌతారో నిర్ణయించుకోండి. గత 30 రోజులుగా రాళ్లదాడి, కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనల్లో ఐదుగురు చనిపోయారు. వాటికి మేం బాధ్యులం కాదు. చాలా రోజుల తర్వాత కశ్మీర్‌లో ఈ మాత్రం శాంతియుత వాతావరణం చూస్తున్నాం’అన్నారు. ఇక ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 80 మంది బుల్లెట్‌ గాయాలకు గురయ్యారని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించడం గమనార్హం. ఉద్రిక్తల్ని అదుపు చేసే క్రమంలో కొందరికి బుల్లెట్‌ గాయాలైన మాట వాస్తవేమేని, అయితే వారంతా చికిత్స అనంతరం కోలుకున్నారని అదనపు డీజీపీ మునీర్‌ ఖాన్‌ చెప్తున్నారు. పరిస్థితులన్నీ ‘కంట్రోల్‌’లోనే ఉన్నాయని అంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top