‘చిన్మయానంద్‌ను తప్పించేందుకే అరెస్టు చేశారు’

Chinmayanand Accuser Says There Is No Justice Over His Arrest - Sakshi

లక్నో : తనపై లైంగిక దాడికి పాల్పడ్డ బీజేపీ నేత, మాజీ మంత్రి చిన్మయానంద్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుందని అత్యాచార బాధితురాలు అనుమానం వ్యక్తం చేశారు. వికృత చర్యలకు పాల్పడ్డ అతడిపై అత్యాచార కేసు నమోదు చేయకుండా శిక్ష తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను భయపడినట్లుగానే తనకు న్యాయం జరిగే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  తాను నిర్వహించే లా కాలేజీలో అడ్మిషన్ ఇప్పించడంతో పాటు లైబ్రరీలో ఉద్యోగం ఇచ్చిన చిన్మయానంద్‌ అందుకు బదులుగా తనను లైంగిక వేధించారంటూ బాధితురాలు ఆరోపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో శుక్రవారం సిట్‌ అధికారులు చిన్మయానంద్‌ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు అతడికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. కాగా విచారణలో భాగంగా బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అంగీకరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌ నవీన్ అరోరా మీడియాకు వెల్లడించారు. అదే విధంగా తన చర్యలకు సిగ్గు పడుతున్నట్లు చిన్మయానంద్‌ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామన్నారు.(చదవండి:అవును.. లైంగికంగా వేధించాను: చిన్మయానంద్‌ )

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బాధితురాలు...‘ నాపై ఎలా అత్యాచారం జరిగిందో సిట్‌కు అన్ని వివరాలు వెల్లడించాను. కానీ వారు మాత్రం చిన్మయానంద్‌పై 376 సెక్షన్‌ ప్రకారం ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. నిజానికి ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేసినట్లు అనిపిస్తోంది. ఇందులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉంది. సిట్‌ విచారణ నాకు ఏమాత్రం సబబుగా అనిపించడం లేదు. చిన్న చిన్న కేసులు పెట్టడం ద్వారా అతడికి శిక్ష తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనిపిస్తోంది’ అని వాపోయారు. అదే విధంగా చిన్మయానంద్‌ అరెస్టు కావడం పట్ల ఆనందంగా ఉందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వల్లే ఇది సాధ్యమైందని బాధితురాలు ప్రశంసించారు. అయితే యోగితో చిన్మయానంద్‌ పేరు కలిపి వినిపించడం తనను వేదనకు గురిచేస్తుందన్నారు. యోగి మంచి వ్యక్తి అని.. ఆయన హయాంలో తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చిన్మయానంద్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్లు 506(నేర ప్రవృత్తితో కూడిన బెదిరింపు), 342(అక్రమ నిర్బంధం), 354డీ, 376సీ కింద మాత్రమే కేసు నమోదు చేశారు. (376 సీ ప్రకారం ఓ వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడి..మహిళను బెదిరించి... ఆమె అంగీకారంతో లైంగిక దాడి చేసినా అది అత్యాచారంగా పరిగణింపబడదు. ఈ కారణంగా నిందితుడికి ఐదు నుంచి పదేళ్ల వరకు సాధారణ జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు.) 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top