స్కూల్‌ ఫీజులు వసూళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌!

Chandigarh Gives Permission To Private Schools To Collect Fees - Sakshi

చండీగఢ్‌ కీలక నిర్ణయం

చండీగఢ్‌: కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా పలు నిబంధనలు సడలించిన కేంద్రం... విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు మాత్రం తెరవకూడదని స్పష్టం చేసింది. అదే విధంగా ఫీజులు వసూలు చేయరాదని, ఉద్యోగుల జీతాల్లో కోత విధించవద్దని నిబంధనల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్‌ స్కూల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చండీగఢ్‌ తమ ఇబ్బందులను వివరిస్తూ దాఖలు చేసింది. పాఠశాలల యాజమాన్య హక్కులు కాపాడాలని.. అలాగే జీతాలు చెల్లించడంతో పాటుగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు ఫీజు వసూలు చేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించింది.(మీడియాకు ముఖం చాటేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ)

ఇక ఇందుకు స్పందించిన విద్యాశాఖ ప్రైవేటు స్కూళ్లు నెలవారీ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా నోటీసులు జారీ చేసింది. అయితే ఏప్రిల్‌, మే నెలల ఫీజును మే 31 వరకు చెల్లించవచ్చని.. అయితే ఇందుకు ఎలాంటి పెనాల్టీలు విధించకూడదని స్పష్టం చేసింది. కాగా ఫీజు వసూళ్ల చెల్లింపు అంశంపై తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారోనన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ ప్రభుత్వ నిర్ణయం సరికాదని.. ఫీజు విషయంలో మరింత గడువు ఇవ్వాలని పలువురు హితవు పలుకుతున్నారు. (బస్సుల గోల.. కాంగ్రెస్‌పై అదితి ఫైర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top