బస్సుల గోల.. కాంగ్రెస్‌పై అదితి ఫైర్‌

Aditi Singh Hits Out At Congress Party On Bus Row - Sakshi

లక్నో : కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే అదితి సింగ్‌ మరోసారి సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీకి చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన బస్సుల్లో చాలా వరకు చిన్న వాహనాలే ఉన్నాయని విమర్శించారు. మరోవైపు వలస కార్మికుల తరలింపునకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రశంసించారు. ఈ మేరకు ఆమె పలు ట్వీట్‌లు చేశారు.  ఇలాంటి విపత్తు సమయాల్లో దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముందుని కాంగ్రెస్‌ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పంపిన బస్సుల్లో సగానికిపైగా బస్సులు రిజిస్ట్రేషన్‌ నంబర్లు ఫేక్‌ అని ఆరోపించారు. కొన్ని వాహనాలకు ఎలాంటి పేపర్లు కూడా లేవన్నారు. (చదవండి : ప్రియాంక గాంధీ అభ్యర్థన మన్నించిన యూపీ ప్రభుత్వం)

ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ వద్ద బస్సులు ఉంటే పంజాబ్‌, రాజస్తాన్‌, మహారాష్ట్రలకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పిల్లలు రాజస్తాన్‌లోని కోటాలో చిక్కుకుపోయినప్పుడు ఈ బస్సులు ఎక్కడున్నాయని నిలదీశారు. రాజస్తాన్‌ ప్రభుత్వం వారిని సస్థలాలకు పంపడానికి ఎలాంటి ఏర్పాటు చేయలేదని.. కనీసం బోర్డర్‌ వరకు కూడా తరలించలేదని విమర్శించారు. వారిని బస్సుల్లో స్వస్థలాలకు తీసుకురావడానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా శ్రమించారని తెలిపారు. రాజస్థాన్‌ సీఎం కూడా ఆదిత్యనాథ్‌ కృషిని ప్రశంసించారని చెప్పారు. కాగా, నోయిడా, ఘాజియాబాద్‌ సరిహద్దులో నిలిచిపోయిన యూపీకి చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ 1,000 బస్సులను నడపడానికి యోగీ ప్రభుత్వాన్ని అనుమతి కోరిన సంగతి తెలిసిందే. ప్రియాంక విజ్ఞప్తిపై స్పందించిన యూపీ సర్కార్‌.. ఆ బస్సులకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.  

అయితే ఆ తర్వాత కొద్ది గంటల్లోనే కాంగ్రెస్‌ పంపిన బస్సుల్లో చాలా వాటికి రిజిస్ట్రేషన్‌ నంబర్లు తప్పుగా ఉన్నాయని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వీటి రిజిస్ట్రేషన్  నెంబర్లలో చాలావరకు ఆటోలు, టూ వీలర్లు, గూడ్స్ క్యారియర్ల రిజిస్ట్రేషన్ నెంబర్లని ఆరోపించారు. ఇందుకు సంబంధించి యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ లల్లు, ప్రియాంక గాంధీ సెక్రటరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అదితి సింగ్‌.. కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top