రాజీనామాలకు ససేమిరా! | Central Ministers deny to resign | Sakshi
Sakshi News home page

రాజీనామాలకు ససేమిరా!

Aug 30 2013 2:09 AM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అవసరమైతే మూకుమ్మడిగా పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమేనని బహిరంగ ప్రకటనలు చేస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల అసలు రంగు బయటపడింది.

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అవసరమైతే మూకుమ్మడిగా పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమేనని బహిరంగ ప్రకటనలు చేస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల అసలు రంగు బయటపడింది. సమైక్యాంధ్ర డిమాండ్‌తో ఢిల్లీకి వచ్చిన సీమాంధ్ర ప్రభుత్వోద్యోగ సంఘాల నేతలు గురువారం ఆ ప్రాంత కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమయ్యారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచడానికి వారంతా రాజీనామాలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. కానీ పదవులు వదులుకుంటే కేంద్రంతో, అధిష్టానంతో చర్చలు జరిపేదెవరంటూ అందుకు వారు ససేమిరా అన్నట్టు తెలిసింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించుకోవడమే ఎజెండాగా పార్లమెంటు హాల్లో జరిగిన ఈ భేటీలో... మంత్రుల రాజీనామాల విషయమై దాదాపు రెండున్నర గంటలకు పైగా తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది.
 
 విభజనపై వెనక్కు వెళ్లే సమస్యే లేదని, సీమాంధ్రులకు ఎదురయ్యే సమస్యలపై మాత్రమే చర్చించాలని అధిష్టానం, కేంద్రం పదేపదే స్పష్టం చేస్తున్నందున కేంద్ర మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే తప్ప కేంద్రం దిగి రాదని ఉద్యోగ నేతలు వాదించారు. మంత్రు లు, ఎంపీలు మాత్రం దానితో ఏకీభవించలేదు. ‘‘విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి మీతో పాటు మేం కూడా సిద్ధంగానే ఉన్నాం. కేంద్ర స్థాయిలో శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు రాజీనామాలతో ఎలాంటి ఫలితమూ ఉండదు. అంతటి అనివార్య పరిస్థితులే ఏర్పడితే మీతో చెప్పించుకోవాల్సిన పని లేదు. మాటి మాటికీ రాజీనామాలంటూ ప్రజలను మాపైకి ఎగదోసే ప్రయత్నం మానుకోండి’’ అంటూ మంత్రి పళ్లంరాజు, జె.డి.శీలం, ఎంపీ హర్షకుమార్ తదితరులు గట్టిగా అన్నట్టు తెలిసింది.

‘రాజీనామాలు చేసి కూ ర్చుంటే అధిష్టానంతో మాట్లాడేదెవరు? రేపు పార్లమెంట్‌లో బిల్లు చర్చకు వచ్చినప్పుడు సమైక్యాంధ్ర వాణిని విన్పించేదెవరు?’ అని ప్రశ్నిస్తూ హర్షకుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులెవరూ గెలిచే పరిస్థితులు లేవని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుండు సున్నా స్థానాలే వస్తాయని ఉద్యోగ నేతలు అనడంతో కొందరు ఎంపీలు తీవ్రం గా మండిపడ్డట్టు తెలిసింది. ‘కాంగ్రెస్ పార్టీ విషయాన్ని మాకొదలండి. విభజనతో మీకెదురయ్యే సమస్యలపైనే కేంద్రీకరించి ఆందోళనను ఉధృతం చేయండి’ అని వారికి సూచించారు. ఉద్యోగులతో సహా అన్ని వర్గాల ప్రజల ప్ర యోజనాలను కాపాడేలా తమ వాదనలుంటాయన్నారు.
 
 తెలంగాణ ఉద్యోగులతో కలసి పని చేయగలరా?
 విభజనను ఎలాగోలా అడ్డుకోగలిగితే హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ప్రాంత ఉద్యోగులతో తిరిగి ఎప్పట్లా కలసిమెలసి ప్రశాంతంగా పని చేసుకోగలరా? అని ఉద్యోగ సంఘాల నేతలను పళ్లంరాజు ప్రశ్నించారు. ఎలాంటి ఇబ్బందీ ఉండదంటూ వారు తొలుత బదులిచ్చినా, ‘కొద్దిరోజులుగా తెలంగాణ ఉద్యోగులు మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకోనివ్వకుండా దాడులకు దిగుతున్నారు’ అంటూ ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. దాంతో, ‘మా రాజీనామాల విషయాన్ని మాకే వదిలి ముందు మీ ఉద్యమ పర్యవసానాలు, భావి కార్యాచరణ గురించి ఆలోచించుకొని ముందుకు సాగండి’ అంటూ వారికి మంత్రులు హితవు పలికినట్టు సమాచారం.
 
  భేటీలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, ఎస్‌పీవై రెడ్డి, హర్షకుమార్, బొత్స ఝాన్సీ, ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం పార్లమెంటులో ఎక్కువగా ప్రైవేటు చర్చలుండటమే గాక శని, ఆదివారాల్లో సెలవులు కాబట్టి సోమవారం తిరిగి సమావేశమై భావి కార్యాచరణపై తుది నిర్ణయానికి రావాలని సీమాంధ్ర మంత్రులంతా భావించినట్టు తెలిసింది. ఉద్యోగులతో భేటీలో ఒక దశలో రాజీనామాకు కోట్ల, కావూరి, పళ్లంరాజు సంసిద్ధత కూడా తెలిపినట్టు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement