
పారిస్: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం మొదలైంది. నెల రోజుల క్రితమే ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సెబాస్టియన్ లెకోర్ను సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన గత నెల 9న ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చారు. నెల లోపలే పదవి నుంచి తప్పుకోవాల్సి వచి్చంది. సెబాస్టియన్ ఆదివారం తన మంత్రివర్గాన్ని నియమించారు. దీనిపై రాజకీయంగా పలు విమర్శలు వచ్చాయి.
దాంతో చేసేది లేక సెబాస్టియన్ రాజీనామా సమర్పించారు. దీన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఆమోదించారు. మాక్రాన్ ఇప్పుడేంద చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారా? లేక జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్‌లో గత రెండేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు రాజీనామా చేయడం గమనార్హం.