breaking news
Public announcement
-
జెట్ విక్రయం టేకాఫ్!!
ముంబై, న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోమవారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్స్ (ఎస్ఐ), ఆర్థిక ఇన్వెస్టర్స్ (ఎఫ్ఐ) నుంచి బిడ్స్‌ను ఆహ్వానించింది. ఈ ప్రతిపాదన ప్రకారం .. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి కనిష్టంగా 3.54 కోట్ల షేర్లు (సుమారు 31.2 శాతం వాటాలు) నుంచి గరిష్టంగా 8.51 కోట్ల దాకా షేర్లను (75 శాతం వాటాలు) విక్రయించే అవకాశం ఉంది. బిడ్ల దాఖలుకు ఆఖరు తేది ఏప్రిల్ 10. అర్హత పొందిన బిడ్డర్లు ఏప్రిల్ 30లోగా తుది బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాగా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థ ఈ బిడ్డింగ్ నిర్వహణలో తోడ్పాటు అందించనుంది. దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ గత కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో విఫలమవుతోంది. సిబ్బంది జీతభత్యాలు కూడా సకాలంలో చెల్లించలేక సతమతమవుతోంది. పలు విమానాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఎయిర్‌లైన్ నియంత్రణను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. మార్చి 25న జెట్ ఎయిర్వేస్ బోర్డు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం.. సంస్థలో మెజారిటీ వాటాలు బ్యాంకుల చేతికి వచ్చాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, ప్రమోటరు నరేష్ గోయల్, ఆయన భార్య జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి నిష్క్రమించారు. సంస్థలో వారి వాటా గతంలో ఉన్న 51 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. ఇక, జెట్ కుప్పకూలకుండా యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగించేందుకు బ్యాంకులు సుమారు రూ. 1,500 కోట్లు సమకూర్చనున్నాయి. ప్రకటన సారాంశం.. ఎస్బీఐ కన్సార్షియం ప్రకటన ప్రకారం.. జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకుల నుంచి రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణాలను పొందింది. తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితిలోకి జారిపోయింది. ఈ నేపథ్యంలోనే సంస్థ విక్రయం చేపట్టడం జరిగింది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) రూపకల్పన, సమర్పణకు సంబంధించిన అన్ని వ్యయాలను బిడ్డర్సే భరించాల్సి ఉంటుందని ప్రకటన పేర్కొంది. దేశ, విదేశాల్లో ఇదే తరహా రంగాల్లో అనుభవమున్న కార్పొరేట్లు వ్యూహాత్మక ఇన్వెస్టర్స్ (ఎస్ఐ) కేటగిరీ కింద బిడ్స్ వేయొచ్చు. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మొదలైన వాటిని ఎఫ్ఐల కేటగిరీ కింద వర్గీకరించారు. ఎస్ఐలకు ఏవియేషన్ వ్యాపారంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. కన్సార్షియంగా ఏర్పడి బిడ్స్ వేసిన పక్షంలో .. అందులో ముగ్గురు సభ్యులకు మించి ఉండకూడదు. కన్సార్షియంలో ఒక్కొక్కరి వాటా 15 శాతానికి పైబడే ఉండాలి. ఆరు అంతర్జాతీయ సంస్థల ఆసక్తి.. జెట్ ఎయిర్వేస్లో వాటాల కొనుగోలుపై ఆరు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ వంటి వ్యూహాత్మక ఇన్వెస్టర్లతో పాటు కేకేఆర్, బ్లాక్‌స్టోన్, టీపీజీ క్యాపిటల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ కన్సార్షియం ఇప్పటికే జెట్ ఎయిర్వేస్లో వాటాల విక్రయంపై టాటా గ్రూప్, టీపీజీ క్యాపిటల్ వంటి సంస్థలతో కూడా సంప్రదింపులు జరిపింది. సోమవారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు 3% పెరిగి రూ. 264.10 వద్ద క్లోజయ్యింది. -
రాజీనామాలకు ససేమిరా!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అవసరమైతే మూకుమ్మడిగా పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమేనని బహిరంగ ప్రకటనలు చేస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల అసలు రంగు బయటపడింది. సమైక్యాంధ్ర డిమాండ్‌తో ఢిల్లీకి వచ్చిన సీమాంధ్ర ప్రభుత్వోద్యోగ సంఘాల నేతలు గురువారం ఆ ప్రాంత కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమయ్యారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచడానికి వారంతా రాజీనామాలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. కానీ పదవులు వదులుకుంటే కేంద్రంతో, అధిష్టానంతో చర్చలు జరిపేదెవరంటూ అందుకు వారు ససేమిరా అన్నట్టు తెలిసింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించుకోవడమే ఎజెండాగా పార్లమెంటు హాల్లో జరిగిన ఈ భేటీలో... మంత్రుల రాజీనామాల విషయమై దాదాపు రెండున్నర గంటలకు పైగా తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. విభజనపై వెనక్కు వెళ్లే సమస్యే లేదని, సీమాంధ్రులకు ఎదురయ్యే సమస్యలపై మాత్రమే చర్చించాలని అధిష్టానం, కేంద్రం పదేపదే స్పష్టం చేస్తున్నందున కేంద్ర మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే తప్ప కేంద్రం దిగి రాదని ఉద్యోగ నేతలు వాదించారు. మంత్రు లు, ఎంపీలు మాత్రం దానితో ఏకీభవించలేదు. ‘‘విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి మీతో పాటు మేం కూడా సిద్ధంగానే ఉన్నాం. కేంద్ర స్థాయిలో శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు రాజీనామాలతో ఎలాంటి ఫలితమూ ఉండదు. అంతటి అనివార్య పరిస్థితులే ఏర్పడితే మీతో చెప్పించుకోవాల్సిన పని లేదు. మాటి మాటికీ రాజీనామాలంటూ ప్రజలను మాపైకి ఎగదోసే ప్రయత్నం మానుకోండి’’ అంటూ మంత్రి పళ్లంరాజు, జె.డి.శీలం, ఎంపీ హర్షకుమార్ తదితరులు గట్టిగా అన్నట్టు తెలిసింది. ‘రాజీనామాలు చేసి కూ ర్చుంటే అధిష్టానంతో మాట్లాడేదెవరు? రేపు పార్లమెంట్లో బిల్లు చర్చకు వచ్చినప్పుడు సమైక్యాంధ్ర వాణిని విన్పించేదెవరు?’ అని ప్రశ్నిస్తూ హర్షకుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులెవరూ గెలిచే పరిస్థితులు లేవని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుండు సున్నా స్థానాలే వస్తాయని ఉద్యోగ నేతలు అనడంతో కొందరు ఎంపీలు తీవ్రం గా మండిపడ్డట్టు తెలిసింది. ‘కాంగ్రెస్ పార్టీ విషయాన్ని మాకొదలండి. విభజనతో మీకెదురయ్యే సమస్యలపైనే కేంద్రీకరించి ఆందోళనను ఉధృతం చేయండి’ అని వారికి సూచించారు. ఉద్యోగులతో సహా అన్ని వర్గాల ప్రజల ప్ర యోజనాలను కాపాడేలా తమ వాదనలుంటాయన్నారు. తెలంగాణ ఉద్యోగులతో కలసి పని చేయగలరా? విభజనను ఎలాగోలా అడ్డుకోగలిగితే హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ప్రాంత ఉద్యోగులతో తిరిగి ఎప్పట్లా కలసిమెలసి ప్రశాంతంగా పని చేసుకోగలరా? అని ఉద్యోగ సంఘాల నేతలను పళ్లంరాజు ప్రశ్నించారు. ఎలాంటి ఇబ్బందీ ఉండదంటూ వారు తొలుత బదులిచ్చినా, ‘కొద్దిరోజులుగా తెలంగాణ ఉద్యోగులు మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకోనివ్వకుండా దాడులకు దిగుతున్నారు’ అంటూ ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. దాంతో, ‘మా రాజీనామాల విషయాన్ని మాకే వదిలి ముందు మీ ఉద్యమ పర్యవసానాలు, భావి కార్యాచరణ గురించి ఆలోచించుకొని ముందుకు సాగండి’ అంటూ వారికి మంత్రులు హితవు పలికినట్టు సమాచారం. భేటీలో కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, ఎస్పీవై రెడ్డి, హర్షకుమార్, బొత్స ఝాన్సీ, ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం పార్లమెంటులో ఎక్కువగా ప్రైవేటు చర్చలుండటమే గాక శని, ఆదివారాల్లో సెలవులు కాబట్టి సోమవారం తిరిగి సమావేశమై భావి కార్యాచరణపై తుది నిర్ణయానికి రావాలని సీమాంధ్ర మంత్రులంతా భావించినట్టు తెలిసింది. ఉద్యోగులతో భేటీలో ఒక దశలో రాజీనామాకు కోట్ల, కావూరి, పళ్లంరాజు సంసిద్ధత కూడా తెలిపినట్టు చెబుతున్నారు.