
మోదీకే మద్దతిస్తానన్న మాధవన్
సాక్షి, ముంబై : దేశంలో ప్రజాస్వామ్య బలోపేతానికి తాను ప్రధాని నరేంద్ర మోదీని సమర్ధిస్తానని నటుడు మాధవన్ చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో మా బాధ్యతను గుర్తుచేసినందుకు ధన్యవాదాలంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి మాధవన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి మీరు సాగిస్తున్న కృషికి సహకారం అందించడం తన విధి అన్నారు.
కాగా, పౌరులు తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాధవన్‌తో పాటు అనుపమ్ ఖేర్, శేఖర్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు పిలుపు ఇచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేసేలా ప్రచారం చేపట్టాలని ప్రధాని మోదీ ట్విటర్‌లో పలువురు నటులకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో బాలీవుడ్ నటులు స్పందించారు.
ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని తమకు ఇష్టమైన సర్కార్‌ను ఎన్నుకుంటామని, భారత సోదరులందరినీ దేశ ప్రజాస్వామ్య పతాక సమున్నతంగా ఎగిరేలా రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నానని అనుపమ్ ఖేర్ ప్రధాని ట్వీట్‌కు బదులిచ్చారు. ఫిల్మ్‌మేకర్ శేఖర్ కపూర్ స్పందిస్తూ దేశ రాజ్యాంగం మనకు ప్రాధమిక హక్కులతో పాటు కొన్ని బాధ్యతలనూ నిర్ధేశించిందని చెప్పుకొచ్చారు. మనమంతా ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.