'పనామా లీక్స్‌'లో ఓ ఇండియన్ క్రికెటర్‌! | Businessmen, former cricketer among Indians in 2nd list of panama papers | Sakshi
Sakshi News home page

'పనామా లీక్స్‌'లో ఓ ఇండియన్ క్రికెటర్‌!

Apr 5 2016 10:59 AM | Updated on Aug 15 2018 2:20 PM

'పనామా లీక్స్‌'లో ఓ ఇండియన్ క్రికెటర్‌! - Sakshi

'పనామా లీక్స్‌'లో ఓ ఇండియన్ క్రికెటర్‌!

విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసి నల్లడబ్బు దాచుకున్న ప్రముఖుల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే విచారణకు ఆదేశించారు.

పలువురి కార్పొరెట్ల బాగోతం రట్టు

విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసి నల్లడబ్బు దాచుకున్న ప్రముఖుల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో 'పనామా పేపర్' లీక్‌ కు సంబంధించి మరింతమంది భారతీయుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ పత్రాల్లో ఉన్న పలువురు భారతీయుల జాబితాను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక మంగళవారం వెల్లడించింది.

ఈ రెండో జాబితాలో పలువురు పారిశ్రామికవేత్తలతోపాటు ఓ భారతీయ క్రికెటర్‌ కూడా ఉన్నాడు. నల్లధనానికి స్వర్గధామలైన దేశాల్లో విదేశీ కంపెనీలు స్థాపించిన భారతీయుల్లో మెహ్రాసన్స్ జెవెలర్స్ అధినేత అశ్వినీకుమార్ మెహ్రా, పారిశ్రామికవేత్తలు గౌతం, కరణ్ థాపర్‌, సతీష్ గోవింద సంతాని, విష్లవ్ బహదూర్‌, హరీశ్ మొహ్‌నాని, మధ్యప్రదేశ్ రిటైర్డ్ ప్రభుత్వాధికారి ప్రభాష్‌ సంఖ్లా తదితరులు ఉన్నారు.

పుణెకు చెందిన సవా హెల్త్‌కేర్ చైర్మన్ వినోద్ రామచంద్ర జాదవ్, మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా, రాజీవ్ దహుజా, బెల్లాస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కు చెందిన కపిల్ సెయిన్ గోయల్‌, వ్యవసాయ పనిముట్లు అమ్మే వివేక్ జైన్ తదితరుల పేర్లు కూడా లీకైన 'పనామా పత్రాల్లో' ఉన్నట్టు వెల్లడైంది. వీరు పన్ను ఎగ్గొట్టేందుకు పలు బోగస్ కంపెనీల్లో డైరెక్టర్లు, షేర్‌ హోల్డర్లుగా ఉన్నారని తెలిసింది.  మరోవైపు 'పనామా పేపర్స్' లీకైన వ్యవహారంపై తాము కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు అమెరికా కూడా తాజాగా వెల్లడించింది. పనామాలోని మొస్సాక్‌ ఫోన్సెకా అనే లా కంపెనీకి చెందిన 1.15 కోట్ల పత్రాలు లీకవ్వడంతో పలువురు మనీలాండరింగ్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.
 

క్రికెటర్‌.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లో కంపెనీ
క్రికెటర్‌ అశోక్ ఓం ప్రకాశ్ మల్హోత్రా 1982-86 మధ్యకాలంలో భారత్ తరఫున 7 టెస్టులు, 20 వన్డేలు ఆడాడు. గతంలో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఆయన పేరిట రికార్డు ఉంది. ప్రస్తుతం కోల్‌కతాలో ఓ క్రికెట్ అకాడమీ నడుపుతున్న ఆయన.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లో 2008 సెప్టెంబర్ 5న ఈ అండ్ పీ ఆన్‌లుకర్స్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి డైరెక్టర్‌గా, షేర్‌ హోల్డర్‌గా కొనసాగుతున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement