భారత్‌ మెడలో ‘బుల్లెట్‌’ గుదిబండ

Bullet Train Loan May Burden India As Yen Is Appreciating - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి బుల్లెట్‌(ముంబై-అహ్మదాబాద్‌) రైలును పరుగులు పెట్టించేందుకు సాంకేతిక సాయంతో పాటు, 88 వేల కోట్ల రూపాయల రుణాన్ని దేశానికి లబ్ధి చేకూరేలా జపాన్‌ ఇవ్వబోతోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2017లో ఎంతో ఆనందంగా ప్రకటించారు. వీటన్నింటికన్నా మించి జపాన్‌ ఇస్తున్న భారీ రుణంపై వడ్డీ కేవలం 0.1 శాతమే. 50 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీనిపై మాట్లాడుతూ జపాన్‌ మనకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లే లెక్క అని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ ఒప్పందం జరిగి ఏడాది పూర్తి కాకముందే ప్రాజెక్టు వ్యయం 7 శాతం అంటే దాదాపు రూ. 6,160 కోట్లు పెరగడం సంచలనంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం జపాన్‌ కరెన్సీ యెన్‌తో పోల్చితే భారత రూపాయి భారీగా పతనం కావడమే. సెప్టెంబర్‌ 15, 2017న భారత్‌, జపాన్‌ల మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు రుణ ఒప్పందం కుదిరింది. అదే రోజున ఫోరెక్స్‌ మార్కెట్‌లో 1 యెన్‌కు 57 పైసలు విలువ ఉంది. కానీ, ప్రస్తుతం ఈ రోజు(జులై 28)న భారత రూపాయి విలువ 62 పైసలకు పడిపోయింది.

2007 సెప్టెంబర్‌ 17న ఒక యెన్‌ విలువ 0.3517 పైసలు. గత పదేళ్లలో రూపాయితో పోల్చినప్పుడు జపాన్‌ యెన్‌ 64 శాతం పుంజుకుంది. వచ్చే 50 ఏళ్లలో రూపాయితో పోల్చినప్పుడు యెన్‌ మరింత బలపడితే జపాన్‌కు మనం చెల్లించాల్సిన రుణం భారీ మొత్తంలో పెరిగిపోతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్‌లో ద్రవ్యోల్బణం 3 శాతంగా నమోదవుతుంది. ఇదే సమయంలో జపాన్‌ ద్రవ్యోల్బణం సున్నాగా నమోదు కానుంది. ఇదే జరిగితే జపాన్‌ కరెన్సీతో పోల్చినప్పుడు రూపాయి 3 శాతం పతనం అవుతుంది. అంటే 20 ఏళ్లలో దాదాపు 60 శాతం పతనం కావొచ్చు. ఈ లెక్కన జపాన్‌ మనకు అప్పుగా ఇచ్చిన 88 వేల కోట్ల రూపాయల మొత్తం లక్షా యాభై వేల కోట్లు అవుతుంది. రుణాన్ని చెల్లించేందుకు 50 ఏళ్ల గడువుంది. ఈ సమయంలో భారతదేశ ద్రవ్యోల్బణంలో మార్పులు రుణంపై భారీ ప్రభావాలు చూపించే అవకాశం మెండుగా ఉంది.

ఇప్పటికే పెరిగిపోతున్న ప్రాజెక్టు వ్యయం..
మరోవైపు బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి 1.1 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మీడియా రిపోర్టులు వస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్‌ పద్ధతిలో కాకుండా బిడ్డింగ్‌ పద్ధతిలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు నిర్మాణదారును పిలిచినట్లయితే దాదాపు 3.2 బిలియన్ డాలర్ల వ్యయాన్ని భారత్‌ తగ్గించుకోగలిగేది(మిగిలిన దేశాల్లో హై స్పీడ్‌ రైలు ప్రాజెక్టుల వ్యయాలతో మన ప్రాజెక్టును పోల్చితే ఈ తేడా తెలుస్తుంది).

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top