
గాడ్సేపై ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్ : ఫైర్‌బ్రాండ్ నేత, భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే దేశప్రజల్లో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. గాడ్సేను ఉగ్రవాదిగా పిలిచే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో దీటుగా బదులిస్తారని అన్నారు. ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలు మరో వివాదానికి ఆజ్యం పోశాయి.
కాగా, మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాదని సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వ్యాఖ్యలపై పలుచోట్ల ఫిర్యాదులు అందగా ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.