నోట్లు మాకు.. చిల్లర మీకు

Best Bus Depot Officials Says Swap Notes For Coins In Our Depot - Sakshi

బెస్ట్‌ బస్‌ డిపోల్లో కొత్త పంథాకు అధికారుల నిర్ణయం

సాక్షి, ముంబై: ఇక నుంచి బస్‌ డిపోల్లో నోట్లు అందజేసి చిల్లర పట్టుకెళ్లండని బెస్ట్‌ సంస్థ కోరుతోంది. చిల్లర కావాలనుకునే వారు అన్ని బెస్ట్‌ బస్‌ డిపోలలో ఆదివారం, ఇతర సెలవు రోజులు మినహా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నోట్లు ఇచ్చి చిల్లర నాణేలు పొందవచ్చని సూచించింది. ముంబై నగరంలోని వివిధ బస్‌ డిపోలలో నోట్లకు బదులుగా చిల్లర డబ్బులు మార్పిడి చేసుకునే సౌలభ్యం బెస్ట్‌ సంస్థ కల్పించింది. దీంతో వ్యాపార సంస్థలు చిల్లర కోసం అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకప్పుడు చిల్లర కోసం బస్‌ కండక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగేది. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి.

బెస్ట్‌ సంస్థ బస్‌ చార్జీలు తగ్గించినప్పటికీ చిల్లర నాణేల బెడద పట్టి పీడించసాగింది.  ప్రతీరోజు ముంబైలోని వివిధ బస్‌ డిపోలలో డ్యూటీ అయిపోగానే ఒక్కో కండక్టరు వేల రూపాయలు విలువచేసే చిల్లర నాణేలు జమ చేస్తున్నాడు. ఇలా నగరంలోని 24 బస్‌ డిపోలలో నిత్యం రూ.లక్షలు విలువచేసే చిల్లర నాణేలు బెస్ట్‌ ఖజానాలో పోగవుతున్నాయి. కొద్ది రోజులు ఇలాగే సాగితే వీటిని భద్రపరిచేందుకు కూడా స్థలం కొరత ఏర్పడనుంది. దీంతో వీటిని ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాటిని లెక్కించి తీసుకునే ఓపిక బ్యాంకు సిబ్బందికి కూడా లేదు. దీంతో అవి డిపోలలోనే మూలుగుతున్నాయి. చివరకు షాపులకు, బిగ్‌ బజార్, టోల్‌ ప్లాజా కేంద్రాలకు చిల్లర డబ్బులు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. నోట్లు తీసుకురండి, చిల్లర డబ్బులు పట్టుకెళ్లండని నినదించనుంది.  

షాపులకు పంపిణీ.. 
బెస్ట్‌ సంస్థ రెండు నెలల కిందట బస్‌ చార్జీలు తగ్గించింది. కనీస చార్జీలు రూ.8 నుంచి రూ.5కు తగ్గించింది. అంతేగాకుండా 8 కిలోమీటర్ల వరకు కనీస చార్జీలే వసూలు చేయడంతో బెస్ట్‌ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీని ప్రభావం షేర్‌ ఆటో, ట్యాక్సీల వ్యాపారంపై తీవ్రంగా చూపింది. చార్జీలు తగ్గించకముందు ప్రతీరోజు సగటున 22–23 లక్షల మంది ప్రయాణించేవారు. చార్జీలు తగ్గించిన తరువాత ఈ సంఖ్య ఏకంగా 32 లక్షలకు పెరిగిపోయింది.

భవిష్యత్తులో మరింత పెరగనుంది. దీంతో రూ.1,2,5,10 విలువచేసే నాణేలు కండక్టర్‌ క్యాష్‌ బ్యాగ్‌లో నిత్యం వేలల్లో పోగవుతున్నాయి. ప్రతీ కండక్టర్‌ డ్యూటీ దిగే ముందు డిపోలలో ఉన్న క్యాష్‌ కౌంటర్‌వద్ద వేలల్లో చిల్లర నాణేలు జమచేస్తున్నాడు. ఇలా ప్రతీరోజు 24 బస్‌ డిపోలలో రూ.11–12 లక్షల వరకు చిల్లర డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో వీటిని సామాన్య ప్రజలకు, వ్యాపారులకు, షాపు యజమానులకు, బిగ్‌ బజార్, టోల్‌ ప్లాజా కేంద్రాలకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. చిల్లర కావాలనుకునే వారు అన్ని బెస్ట్‌ బస్‌ డిపోలలో ఆదివారం, ఇతర సెలవు రోజులు మినహా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నోట్లు ఇచ్చి చిల్లర నాణేలు పొందవచ్చని సూచించింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top