మార్పు దిశగా అస్సాం | Assam as changing direction | Sakshi
Sakshi News home page

మార్పు దిశగా అస్సాం

Apr 11 2016 2:32 AM | Updated on Mar 29 2019 9:31 PM

మార్పు దిశగా అస్సాం - Sakshi

మార్పు దిశగా అస్సాం

అస్సాం పీఠాన్ని నాలుగోసారి దక్కించుకోవాలని కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం చేసింది.

ప్రచారంలో హోరాహోరీగా తలపడ్డ బీజేపీ-కాంగ్రెస్
♦ మార్పు, చొరబాట్లే బీజేపీ ప్రచారాస్త్రాలు
♦ అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకెళ్లిన గొగోయ్
♦ నేడు చివరి విడత ఎన్నికలు
 
 గువాహటి నుంచి సాక్షి ప్రతినిధి: అస్సాం పీఠాన్ని నాలుగోసారి దక్కించుకోవాలని కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం చేసింది. అభివృద్ధే గెలిపిస్తుందని ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆశలు పెట్టుకున్నారు. 2014 నాటి  లోక్‌సభ ఎన్నికల్లో 7 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉంది.  15 ఏళ్ల  కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మార్పు తథ్యమని చెబుతోంది. మార్పు, బంగ్లా నుంచి  చొరబాట్లే ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రచారంలో దూసుకుపోయింది. అస్సాంలో సోమవారం చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు(61స్థానాల్లో) జరగనున్నాయి.

 అభివృద్ధే కాపాడాలి: కాంగ్రెస్
 అస్సాం కోసం 15 ఏళ్లుగా చేసిన అభివృద్ధి తనకు కలిసొస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, అస్తవ్యస్త పాలన ఆ పార్టీకి గుదిబండలా మారాయి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు ఏఐయూడీఎఫ్ వైపు మొగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికలకు ముందే రూ.2 కిలో బియ్యం పథకంతో పాటు  బరాక్ లోయ ప్రజలకు గొగోయ్ ప్యాకేజీ ప్రకటించారు. రెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అస్సాంకు చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కొన్ని వర్గాలకు ఎస్టీ హోదా ఇస్తామని చెప్పి విస్మరించారని, చొరబాట్ల నిరోధంలో విఫలమయ్యారంటూ విమర్శించింది. చొరబాట్ల అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రం చేయడం వెనుక మత విద్వేషాలు రెచ్చగొట్టడడమే లక్ష్యమని ఆరోపణలు గుప్పించింది.

 మా గెలుపు పక్కా : బీజేపీ
 మార్పు నినాదంతో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 7స్థానాలు గెల్చుకున్నప్పటి నుంచే అసెంబ్లీ పోరుకు కసరత్తు మొదలుపెట్టింది. అస్సాం నిర్మాణ్ పేరిట సదస్సులు నిర్వహించి ఎజెండా రూపొందించింది. బీజేపీకి ఓటేస్తే కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తామంటూ వాగ్దానం చేసింది. సీఎం అభ్యర్థిగా సర్వానంద సోనోవాల్‌ను ముందుగానే ప్రకటించింది. 15 ఏళ్ల కిందట చక్రం తిప్పిన అస్సాం గణ పరిషత్‌ను తన వైపు తిప్పుకోవడంలో సఫలమైంది. బొడోలాండ్ ప్రాంతంలో పట్టున్న బీపీఎఫ్‌ను కూడా తన కూటమిలో చేర్చుకుని గెలుపు అవకాశాలు మెరుగుపర్చుకుంది.  కాంగ్రెస్ పాలనతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైందని బీజేపీ సీఎం అభ్యర్థి సోనోవాల్ ‘సాక్షి’తో అన్నారు. తమకు అధికారమిస్తే అవినీతి రహిత సుపరిపాలన అందిస్తామని చెప్పారు.

 చక్రం తిప్పుతాం: ఏఐయుడీఎఫ్
 రాష్ట్రంలో దాదాపు 30 స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం ఓటర్ల మద్దతుపై ఏఐయూడీఎఫ్ ఆశలు పెట్టుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఊపుతో రాష్ట్రంలో చక్రం తిప్పాలని భావిస్తోంది.

 నేడు బెంగాల్ తొలి దశ రెండో భాగం
 కోల్‌కతా: సోమవారం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ రెండో భాగం ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement