అసౌకర్యానికి సారీ.. కానీ ఆపరేషన్ తప్పలేదు! | amit shah says sorry, but tells surgery was must regarding demonitisation | Sakshi
Sakshi News home page

అసౌకర్యానికి సారీ.. కానీ ఆపరేషన్ తప్పలేదు!

Nov 19 2016 8:07 PM | Updated on Sep 27 2018 9:08 PM

అసౌకర్యానికి సారీ.. కానీ ఆపరేషన్ తప్పలేదు! - Sakshi

అసౌకర్యానికి సారీ.. కానీ ఆపరేషన్ తప్పలేదు!

కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలకు కలిగిన అసౌకర్యానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సారీ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలకు కలిగిన అసౌకర్యానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సారీ చెప్పారు. లక్నోలోని బాబు బనారసీదాస్ యూనివర్సిటీలో యువ ఓటర్లతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏ ఆపరేషన్ చేసినా కొంత కాలం పాటు నొప్పి తప్పదని, కానీ అది భవిష్యత్తుకు మంచిదని అన్నారు. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, అయితే ఒక్కసారి కరెన్సీని క్లీనప్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనిపించిందని, ఆ నిర్ణయాన్ని అందుకే ప్రధాని అంత రహస్యంగా ఉంచారని తెలిపారు. 
 
రాబోయే కొద్ది రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఉన్న క్యూలైన్లు చాలా వరకు తగ్గుతాయని ఆయన హామీ ఇచ్చారు. నోట్ల రద్దును కొన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, అది కేవలం రాజకీయ ప్రేరేపితమేనని అన్నారు. వరద సమయంలో ప్రజలంతా ఒకే చెట్టుమీదకు ఎక్కినట్లుగా ప్రతిపక్షాలు కలిశాయని ఎద్దేవా చేశారు. సమాజంలోని ప్రతి వర్గంతోనూ సంప్రదింపులు జరపాలని బీజేపీ యోచిస్తోందని ఆయన చెప్పారు. తమకు వచ్చిన అన్ని సూచనలను రికార్డు చేస్తున్నామన్నారు. దేశంలోని 125 కోట్ల మందికీ ఉద్యోగాలు ఇవ్వడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదని.. అయితే ఇప్పుడు ఉద్యోగం నిర్వచనాన్ని తాము మారుస్తున్నామని అన్నారు. సొంత కాళ్ల మీద నిలబడి స్టార్టప్‌లు స్థాపించడం కూడా అవసరమని తెలిపారు. 
 
కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు పాల్పడుతోందని, ఆ పార్టీలో సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ఆ తర్వాత ఆయన కొడుకు లేదా కూతురు మాత్రమే పార్టీ అధ్యక్షులు అవుతారని.. అదే బీజేపీలో ఏమీ లేని తనను పార్టీ అధ్యక్షుడిగా చేశారని గుర్తుచేశారు. గోమతీ నది వద్ద అఖిలేష్ ప్రభుత్వం చేసినది కేవలం మేకప్ మాత్రమేనని, బీజేపీ మాత్రం అక్కడ నిజమైన అభివృద్ధి చేయాలని యోచిస్తోందని తెలిపారు. యూపీలో చాలామంది చదువుకున్నా.. నిరుద్యోగం మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement