మహిళల వల్లే..!

Alcohol Consumption Increased In Delhi Because Of Women - Sakshi

న్యూఢిల్లీ : ఎక్కువ మంది మహిళలు.. అది కూడా ఎక్కువగా తాగుతుండటం వల్లే దేశ రాజధానిలో మద్యం వినియోగం బాగా పెరిగిందని ఓ సర్వే తెలిపింది. పెరిగిన సంపాదన, ఆకాంక్షలు, జీవనశైలి, సామాజిక ఒత్తిడులు మహిళల్లో మద్యం అలవాటును ప్రేరేపిస్తున్నాయని ఆ సర్వే తేల్చింది. ఢిల్లీలోని 18–70 మధ్య వయస్సున్న 5 వేల మంది మహిళల నుంచి కమ్యూనిటీ ఎగెనెస్ట్‌ డ్రంకెన్‌ డ్రైవింగ్‌(సీఏడీడీ) సంస్థ ఈ సర్వే చేసింది. మద్యానికి దూరంగా ఉన్నారని భావిస్తున్న మహిళలూ మద్యం తాగుతుండటంతో ఆల్కహాల్‌ వినియోగం బాగా పెరిగిందని తెలిపింది.  ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా ఆల్కహాల్‌ వినియోగిస్తున్న దేశంగా పేరున్న భారత్‌లో మద్యం వాడకం వేగంగా పెరుగుతోందని తెలిపింది. 2005లో ఒక్కో వ్యక్తి తలసరి వినియోగం 2.4 లీటర్లు ఉండగా 2016 నాటికి అది 5.7 లీటర్లకు పెరిగిందని క్యాడ్‌ పేర్కొంది.

ఇతర సర్వేలు కూడా ఇదే చెప్పాయి..
2010–2017 సంవత్సరాల మధ్య భారత్‌లో మద్యం వినియోగం 38 శాతం పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో) చేపట్టిన అధ్యయనంలో తేలింది. సంప్రదా యం ప్రకారం భారత్‌లో మహిళలు మద్యం తాగడం అరుదు. అయితే, మహిళల్లో పెరిగిన అలవాటు కారణంగా మద్యం మార్కెట్‌ 5 ఏళ్లలో 25 శాతం పెరిగినట్లు భారత ప్రభుత్వ సెంటర్‌ ఫర్‌ ఆల్కహాల్‌ స్టడీస్‌ కూడా పేర్కొంది. ఢిల్లీలోని మద్యంప్రియుల్లో 40 శాతం మంది పురుషులు కాగా 20 శాతం (సుమారు 15 లక్షలు) మంది మహిళలు అని ఎయిమ్స్‌ చేపట్టిన సర్వేను క్యాడ్‌ ఉటంకించింది.

కారణాలు..
మద్యం కేంద్రంగానే చాలా వరకు సామాజిక కార్యక్రమాలు ఉంటున్నాయి. సామాజికంగా కలిసిపోవడానికి ఆల్కహాల్‌ను సాధనంగా అందరూ భావిస్తున్నారు. అందుకే ఇది మహిళల్లో కూడా సమస్యగా కాకుండా మామూలు విషయంగా మారిపోయింది. పని ప్రదేశం లేదా వృత్తి సంబంధం అంశాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణించడం, వారిలో సంపాదనతోపాటు వినియోగ సామర్థ్యం పెరగడంతో ఆల్కహా ల్‌ను ఒత్తిడి తగ్గించుకునేం దుకు, కుంగుబాటును దూరం చేసుకునేందుకు, ఒంటరితనం, శారీరక, భౌతిక సమస్య లను, వేగంగా మారుతున్న జీవన శైలిలో ఇమిడేందుకు కూడా మహిళలు మద్యానికి అలవాటు పడుతున్నారు. ప్రశాంతత కోసం, తమను తాము వ్యక్తీకరిం చుకోవటానికి ఉత్తమ మార్గం మద్యం తీసుకోవడమేనంటూ టీవీలు, సినిమాల్లో చూపించడం మహిళల్లో ఈ అలవాటు పెరగటానికి కారణమవుతోందని క్యాడ్‌ పేర్కొంది. ఉత్సాహం కోసం, విశ్రాంతి కోసం కాక్‌టెయిల్, బెర్రీ డ్రింక్స్‌ను మహిళలు తాగొచ్చంటూ జరుగుతున్న మార్కెట్‌ శక్తుల ప్రచారమూ మహిళలపై పడింది’ అని సర్వే పేర్కొంది.

మహిళల్లో ఎంతమంది..

  • 18–30 ఏళ్ల మహిళల్లో 43.7%మంది ఆల్కహాల్‌ను సాధారణంగా తీసుకుంటుండగా, 31–45 ఏళ్ల వారిలో 41.7% మంది సామాజిక,, వృత్తి పరమైన అవసరం రీత్యా మద్యం తాగుతున్నారు.  
  •  60 ఏళ్లకు పైబడిన వారిలో 53 % మంది, 46–60 ఏళ్ల వారిలో 39.1% మంది భావోద్వేగం కారణంగా తాగుతున్నారు. 
  • 18–30 ఏళ్ల గ్రూపులో 45.6% మంది మహిళలు ఒక దఫాలో నాలుగు అంతకంటే ఎక్కువ డ్రింకులు తాగుతున్నారు. 
  • 31–45 ఏళ్ల వారిలో 44.9% మంది ఒక పర్యాయంలో మూడు నుంచి నాలుగు డ్రింకులు తాగుతున్నారు.
  • 46–60 ఏళ్ల మహిళల్లో 22% మంది, 60 ఏళ్లు పైబడిన వారిలో 24.6శాతం మంది ఒకే దఫా నాలుగు అంతకంటే ఎక్కువ డ్రింకులు తాగుతున్నారు. 
  • 18–30 ఏళ్లు, 31.45 ఏళ్ల గ్రూపుల మహిళల్లో మద్యం అలవాటు ఎక్కువగా ఉంది.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top