అత్తపై ఐశ్వర్యారాయ్‌ ఫిర్యాదు.. కేసు నమోదు

Aishwarya Roy Alleges Mother In Law Rabri Devi Dragged Her Charged - Sakshi

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీపై కేసు నమోదైంది. రబ్రీదేవీ తనను హింసించారని ఆరోపిస్తూ.. లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ భార్య ఐశ్వర్యారాయ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనకు విడాకులు కావాలంటూ తేజ్‌ ప్రతాప్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు విచారణలో భాగంగా తేజ్‌ ప్రతాప్‌ భార్య ఐశ్వర్య... తేజ్‌కు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయి తనను వేధించేవాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తేజ్‌ కుటుంబ సభ్యులు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో భర్తతో సహా తన అత్త రబ్రీదేవి సైతం తనను వేధింపులకు గురిచేశారని ఐశ్వర్యరాయ్‌ పోలీసులను ఆశ్రయించారు. తేజ్‌ప్రతాప్‌ విడాకులకు పట్టుబట్టడంతో రబ్రీదేవి తనను తీవ్రంగా కొట్టి బయటకు నెట్టివేశారని పేర్కొన్నారు. 

మెసేజ్‌ రావడంతో కిందకు వచ్చాను...
‘నేను నా గదిలో టీవీ చూస్తున్న సమయంలో నా ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. నన్ను, నా కుటుంబ సభ్యులను కించపరుస్తూ తేజ్‌ మద్దతుదారులు పట్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో పోస్టర్లు అతికించారని తెలిసింది. వెంటనే కిందకు దిగి ఈ విషయం గురించి మా అత్తగారిని నిలదీశాను. నా తల్లిదండ్రుల పరువు తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాను. వెంటనే తను నన్ను అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టారు. నా జుట్టు పట్టుకుని లాగుతూ.. కిందపడేశారు. తల, మోకాళ్లు, పాదాలపై కర్రతో కొట్టారు. బంగ్లా నుంచి గెంటివేసే ముందు చెప్పులు కూడా తొడుక్కోనివ్వలేదు. నా ఫోన్‌, ఇతర వస్తువులు లాక్కొన్నారు’ అంటూ సర్కులర్‌ రోడ్డు నివాసం బయట ఏడుస్తూ ఐశ్వర్య విలేకరులతో గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ క్రమంలో తన తండ్రి చంద్రికారాయ్‌ సహా ఇతర కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం రబ్రీ దేవిపై కేసు నమోదు చేశారు. ఇక బిహార్‌ మాజీ సీఎం దరోగా రాయ్‌ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో గతేడాది మే 12వ తేదీన తేజ్‌ ప్రతాప్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top