గణిత ఉపాధ్యాయుడు ఇమ్రాన్‌ఖాన్ ఒక్కరోజులోనే ప్రముఖ వ్యక్తి అయ్యారు
న్యూఢిల్లీ: గణిత ఉపాధ్యాయుడు ఇమ్రాన్‌ఖాన్ ఒక్కరోజులోనే ప్రముఖ వ్యక్తి అయ్యారు. మొబైల్ యాప్‌లతో విద్యార్థులకు సేవలందిస్తున్న ఆయన పేరును ప్రధానమంత్రి నరేంద్రమోదీ లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో ప్రస్తావించడంతో ఆయన కృషి వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మరింత విద్యార్థులకు మొబైల్ యాప్ సేవలు అందించేందుకు వీలుగా.. ప్రభుత రంగం టెలిఫోన్ సంస్థ బీఎస్‌ఎన్ఎల్ ఆయనకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించనుంది.
రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఇమ్రాన్‌ఖాన్‌ను శనివారం ఉదయం కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఫోన్ చేసి.. అభినందించారు. ఓసారి ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. అదేవిధంగా ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్టు ఆయనకు తెలియజేశారు. సంస్కృత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఇమ్రాన్‌ఖాన్ విద్యా విషయాలతో 50కిపైగా మొబైల్ యాప్స్ రూపొందించి.. వాటిని ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థులకు ప్రాంతీయ భాషల్లో మొబైల్ యాప్స్ ద్వారా విదా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు.