Wembley Stadium
-
ఇంగ్లండ్ కల నెరవేరేనా?
నెల రోజులుగా ఫుట్‌బాల్ ప్రియులను అలరిస్తున్న యూరో కప్ టోర్నమెంట్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. లండన్‌లోని విఖ్యాత వెంబ్లీ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక గం. 12:30 నుంచి జరిగే టైటిల్ పోరులో ఇంగ్లండ్, ఇటలీ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. తొలిసారి యూరోలో ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్ కప్ కొట్టేయాలనే కసి మీద ఉండగా... ఇప్పటికే ఒకసారి (1968లో) చాంపియన్‌గా నిలిచిన ఇటలీ రెండోసారి ఆ ఘనత వహించేందుకు ఉత్సాహంగా ఉంది. రెండు జట్లు కూడా గ్రూప్ స్టేజ్ నుంచే ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ తుదిపోరుకు అర్హత సాధించాయి. ఇంగ్లండ్ కెప్టెన్, ఫార్వర్డ్ హ్యారీ కేన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా... గత 33 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇటలీ ఓటమి లేకుండా దూసుకెళుతోంది. ఫైనల్ సోనీ సిక్స్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. -
తొలిసారి ‘యూరో’ ఫైనల్లో ఇంగ్లండ్
లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అభిమానుల 55 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. ఒక మెగా టోర్నీలో కొన్ని దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత ఆ జట్టు ఫైనల్ చేరింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ కప్‌లో ఇంగ్లండ్ తుది పోరుకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు సమంగా నిలవగా... అదనపు సమయంలో సాధించిన గోల్‌తో ఇంగ్లండ్ ముందంజ వేసింది. డెన్మార్క్ తరఫున మైకేల్ డామ్స్‌గార్డ్ 30వ నిమిషంలో గోల్ చేసి ఆధిక్యం అందించగా... డెన్మార్క్‌కే చెందిన సైమన్ జార్ ‘సెల్ఫ్ గోల్’ (39వ నిమిషం)తో ఇంగ్లండ్ ఖాతాలో గోల్ చేరి స్కోరు సమమైంది. నిర్ణీత సమయం 1–1తో ముగిసింది. అనంతరం మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌లో 104వ నిమిషంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ గోల్ సాధించి తన జట్టును గెలిపించాడు. 1966లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్ ప్రపంచ కప్‌లో గానీ, యూరో కప్‌లో గానీ (26 ప్రయత్నాల్లో) ఫైనల్ చేరలేకపోయింది. ఆద్యంతం హోరాహోరీ... ఇంగ్లండ్, డెన్మార్క్ పోరు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. సుమారు 66 వేల మంది సొంత ప్రేక్షకుల సమక్షంలో వెంబ్లీ స్టేడియంలో ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించగా...టోర్నీలో సత్తా చాటుతూ వచ్చిన డెన్మార్క్ కూడా అదే జోరు కనబరిచింది. ముఖ్యంగా డెన్మార్క్ గోల్ కీపర్ కాస్పర్ స్కెమికల్ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని పదే పదే అడ్డుకున్నాడు. ఇరు జట్లు తొలి గోల్ కోసం శ్రమిస్తున్న దశలో ఇంగ్లండ్ ఫౌల్ కారణంగా డెన్మార్క్‌కు ఫ్రీ కిక్ అవకాశం దక్కింది. డామ్స్‌గార్డ్ దీనిని సమర్థంగా ఉపయోగించుకోవడంతో ఆ జట్టు ముందంజ వేసింది. ఆ తర్వాత హ్యారీ గోల్ చేసేందుకు చేరువగా వచ్చినా....డెన్మార్క్ కీపర్ ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే కొద్ది సేపటికే హ్యారీ సహచరుడు స్టెర్లింగ్‌కు బంతి అందకుండా తప్పించే ప్రయత్నంలో డెన్మార్క్ ఆటగాడు జార్ తన గోల్‌పోస్ట్‌లోకే బంతిని పంపించడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. వివాదాస్పద పెనాల్టీ... స్కోర్లు సమమైన తర్వాత మరో 51 నిమిషాల పాటు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ ఆధిక్యం దక్కలేదు. ఎక్స్ట్రా టైమ్‌లో పెనాల్టీ ఏరియాలోకి దూసుకొచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు స్టెర్లింగ్, డెన్మార్క్ ఆటగాడు మథియాస్ జెన్సన్కు తగిలి కింద పడ్డాడు. రిఫరీ పెనాల్టీ ప్రకటించగా... వీడియో రివ్యూ (వార్) తర్వాత అదే ఖాయమైంది. హ్యారీ కొట్టిన కిక్‌ను ఈసారి కూడా స్కెమికల్ సమర్థంగా అడ్డుకున్నా... ‘రీబౌండ్’లో హ్యరీ మళ్లీ గోల్ పోస్ట్‌లోకి పంపించడంతో వెంబ్లీ మైదానం హోరెత్తిపోయింది. ఈ పెనాల్టీపై డెన్మార్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా లాభం లేకపోయింది. -
యూరో కప్ 2020: సెమీస్ పోరులో తలపడేది వీళ్లే!
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మూడు సార్లు చాంపియన్ స్పెయిన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్ఫైనల్లో స్పెయిన్ పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్విట్జర్లాండ్‌పై గెలుపొందింది. ఆట 8వ నిమిషంలో డేనిస్ జకారియా సెల్ఫ్ గోల్‌తో స్పెయిన్‌కు గోల్ అందించాడు. 68వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ షాకిరి గోల్ చేయడంతో స్కోర్ 1–1తో సమమైంది. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఇరు జట్లు కూడా ఒక్కో గోల్ సాధించడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్ (అదనపు సమయం)కు దారి తీసింది. 30 నిమిషాల అదనపు సమయంలో ఇరు జట్లు మరో గోల్ సాధించడంలో విఫలమవ్వడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక పెనాల్టీ షూటౌట్లో ఎటువంటి తడబాటుకు గురవని స్పెయిన్ విజేతగా నిలిచింది. మరో పోరులో బెల్జియం, ఇటలీ మధ్య జరిగిన క్వార్టర్ఫైనల్లో ఇటలీ పైచేయి సాధించింది. బెల్జియంను 2-1 తేడాతో ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బారెల్లా, ఇన్‌సిగ్నేలు చెరో గోల్ సాధించారు. ఇక సెమీస్ పోరులో ఇటలీ స్పెయిన్లు వెంబ్లే స్టేడియం(లండన్)లో తలపడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు చెక్ రిపబ్లిక్ డెన్మార్క్‌లు తలపడనున్నాయి. చదవండి: ఆడకుంటే జీతం లేదు.. మెస్సీకి షాకిచ్చిన ఆ క్లబ్ -
ఆయనకు ఇక ఫ్రీ ఇంటర్నెట్!
న్యూఢిల్లీ: గణిత ఉపాధ్యాయుడు ఇమ్రాన్‌ఖాన్ ఒక్కరోజులోనే ప్రముఖ వ్యక్తి అయ్యారు. మొబైల్ యాప్‌లతో విద్యార్థులకు సేవలందిస్తున్న ఆయన పేరును ప్రధానమంత్రి నరేంద్రమోదీ లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో ప్రస్తావించడంతో ఆయన కృషి వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మరింత విద్యార్థులకు మొబైల్ యాప్ సేవలు అందించేందుకు వీలుగా.. ప్రభుత రంగం టెలిఫోన్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆయనకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించనుంది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఇమ్రాన్‌ఖాన్‌ను శనివారం ఉదయం కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఫోన్ చేసి.. అభినందించారు. ఓసారి ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. అదేవిధంగా ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్టు ఆయనకు తెలియజేశారు. సంస్కృత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఇమ్రాన్‌ఖాన్ విద్యా విషయాలతో 50కిపైగా మొబైల్ యాప్స్ రూపొందించి.. వాటిని ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థులకు ప్రాంతీయ భాషల్లో మొబైల్ యాప్స్ ద్వారా విదా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. -
మోదీ రాక...వెంబ్లీ స్టేడియంలో అపూర్వ ఘట్ణం
-
కరచాలనం కోసం 'క్యూ' కట్టారు!
లండన్: అప్పుడెప్పుడో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకునేందుకు భారత పారిశ్రామిక దిగ్గజాలు క్యూలో నిల్చున్న దృశ్యాలు గుర్తున్నాయిగా! సరిగ్గా ఇప్పుడు అలాంటి సీనే రిపీట్ అవుతోంది లండన్ లోని వెంబ్లే స్టేడియంలో. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న భారీ సభకు ముందు ఇంగ్లాండ్ లోని పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఒకొక్కరిగా ఆయనతో కరచాలనం చేశారు. పద్ధతిగా క్యూలో వచ్చి భారత ప్రధానిని పలకరించారు. ఒకటి, రెండు మాటల్లో క్లుప్తంగా సాగిన సంభాషణ ద్వారా భారత్ లో పెట్టుబడులకు సిద్ధమనే తమ ఆకాంక్షను తెలియజేశారు. ఈ భేటీలో ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సహా పలువురు కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇంగ్లాండ్, భారత జాతీయగీతాల ఆలపనతో కార్యక్రమం ప్రారంభమైంది. -
లండన్‌లో మారుమోగుతోన్న 'భారతీయం'
లండన్: 'దేఖీహై సారీ దునియా.. జపాన్ సె లేకే రష్యా.. ఆస్ట్రేలియా సే లేకే అమెరికా.. మేడిన్ ఇండియా.. మేడిన్ ఇండియా.. ఎక్ దిల్ చాహియే బస్ మేడిన్ ఇండియా..' అంటూ ఇండిపాప్ సింగర్ అలీషా చినాయ్ ఆలపించిన గీతానికి దాదాపు 60 వేల మంది శ్రోతలు కదంకలుపుతూ వంతపాడారు. మరో సింగర్ జాన్ సేన్ (కమల్జిత్ సింగ్ జ్యోతి) వినిపించిన ర్యాప్ జడిలో ఓలలాడారు. ఇదంతా ఏ మ్యూజిక్ ఫంక్షనో అవార్డ్ సెర్మనీనో అనుకుంటే పోరపాటే! అవును, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న సభావేదిక లండన్ లోని వెంబ్లే స్టేడియంలో తాజా దృశ్యాలివి. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పలువురు కాళాకారుల ప్రదర్శనలతోపాటు అద్భుతమైన లైటింగ్ తో సాస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లో మోదీ ఇక్కడి ప్రధాన వేదిక నుంచి ప్రసంగించనున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లండన్ కు చేరుకున్న నరేంద్ర మోదీ.. ఇంగ్లాండ్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. క్వీన్ ఎలిజబెత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అరుదైన బహుమతులు అందజేశారు. శుక్రవారం రాత్రి వెంబ్లే స్టేడియంలో ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇంగ్లాండ్ లోని 1500 ప్రాంతాల నుంచి దాదాపు 60 వేల మంది ఎన్నారైలు ఇప్పటికే స్టేడియం వద్దకు చేరుకున్నారు. స్థానిక రాజకీయనేతలు సైతం ఆశ్యర్యానికి లోనయ్యేలా మోదీ సభకు పెద్ద ఎత్తున జనం హాజరుకావడం విశేషం. గతంలో అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ మోదీ ఇలా 'రాక్ స్టార్' తరహా సభల్లో పాల్గొనడం గమనార్హం. -
బయటపడ్డ 50 కేజీల బాంబు
లండన్: పేలకుండా ఉన్న రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి 50 కేజీల బాంబు ఒకటి బ్రిటన్ లో బయటపడింది. లండన్ లోని వెంబ్లె జాతీయ ఫుట్ బాల్ మైదానానికి సమీపంలో దీన్ని కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఇది పేలితే 4 00 మీటర్ల వరకు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. 50 కేజీల బరువు ఉన్న ఈ బాంబు 1940కు ముందు లండన్ పై జర్మనీ విసిరిందిగా భావిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా దీన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రజలు సహకరించాలని లండన్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత మార్చి నెలలో ఆగ్నేయ లండన్ లోని బెర్మాండ్ సేలో 250 కేజీల బాంబును గుర్తించి, సురక్షితంగా నిర్వీర్యం చేశారు.