Sakshi News home page

సిక్కుల ఊచకోత : కన్నీటి జ్ఞాపకాలు

Published Wed, Nov 1 2017 8:54 AM

after 33 years.. didnit forget anti-Sikh riots - Sakshi

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోతకు గురయ్యారు. వేల సంఖ్యలో అమాయక సిక్కులు అసువులు బాసారు. 33 ఏళ్ల నాటి విషాద పరిస్థితులు.. ఆనాటి జ్ఞాపకాలు బాధితుల కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి.

ఇందిర హత్యానంతర పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షి అయిన అత్తార్‌ కౌర్‌... కన్నీటి గాథ ఇది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో అత్తార్‌ కౌర్‌ భర్తతో సహా 11 మంది కుటుంబ సభ్యులను కోల్పొయి దీనావస్థలొకి వెళ్లిపోయింది. ఆనాటి పరిస్థితులపై అత్తార్‌ కౌర్‌ పంజాబ్‌లోని ఒక న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడారు.

మారణహోమానికి 33 ఏళ్లు
నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు బాడీగార్డులు హత్య చేయడంతో.. ఒక్క సారిగా దేశమంతా సిక్కు వ్యతిరేకత అల్లర్లు చెలరేగాయి. ప్రధానంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా జరిగాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే అధికంగా ఢిల్లీలోనే మారణహోమం అధికంగా జరిగింది. అల్లరి మూకలు అత్యంత దారుణంగా 3 వేల మంది సిక్కులను ఊచకోత కోశాయి. ఈ మారణహోమానికి నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జన్‌ కుమార్‌ కారకుడని సీబీఐ ఢిల్లీ సెషన్స్‌ కోర్టుకు తెలిపింది.

చితికిన కుటుంబం
అత్తార్‌ కౌర్‌ నాటి తూర్పు ఢిల్లీలోని త్రిలోకపురిలో భర్త, పిల్లలతో కలిసి నివాసముండేది. ఇందిర హత్యానంతరం అల్లరి మూకలు సిక్కులు అధికంగా నివసించే ప్రాంతాలపై దాడులకు దిగాయి. అత్తార్ కౌర్‌ భర్త కృపాల్‌ సింగ్‌ అక్కడే చిన్నచిన్ని వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పొషించేవాడు.

కళ్లముందే దారుణం
కృపాల్‌ సింగ్‌ వ్యాపార పనుల రీత్యా అప్పుడే గురుద్వారాకు వెళ్లారు. ఇంటి బయట.. 7 మంది చిన్నారులు, స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. ఇంటి బయట అత్త, మామ ఉన్నారని అత్తర్‌ కౌర్‌ తెలిపారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన అల్లరి మూకలు.. ఆడుకుంటున్న చిన్నారులను, బయ ఉన్న పెద్దవారిని అత్యంత పాశవికంగా హత్య చేశాయని ఆమె చెప్పారు. తన రెండు నెలల పసిబిడ్డతో సహా, 6 మంది పిల్లలను, భర్త, అత్తమామలసహా 11 మంది కుటుంబ సభ్యులను అల్లరి మూకలు పొట్టన పెట్టుకున్నాయని ఆమె ఆవేదనగా తెలిపారు.

సజీవ దహనం
జంతువులును వేటాడినట్టు అల్లరి మూకలు సిక్కులను వెంటాడి వేటాడి చంపాయని అత్తార్‌ కౌర్‌ కన్నీరు పెట్టుకుంటూ తెలిపారు. కొద్దిమందిని దారుణంగా హింసించి.. సజీవ దహనం చేసిన ఘటనలు ఉన్నాయని కౌర్‌ తెలిపారు.

ముస్లింల సాయం
అల్లరి మూకలు మరింత దారుణాలకు ఒడిగడుతున్న సమయంలో మాకు పక్కనే ఉన్న ఒక ముస్లిం కుటుంబం.. మిగిలిన ముగ్గురు పిల్లలను, నాకు వారి ఇంట్లో రక్షణ కల్పించారని ఆమె తెలిపారు. సాయంత్రం ట్రిపోలి రహదారి పక్కన పిల్లల మృత దేహాలు, దహనమైన అత్త, మామలు, భర్త శరీరాలను చూశానని ఆమె హృదయ విదారకంగా తెలిపారు. ఇందిరా హత్యానంతర పరిస్థితులు గుర్తుకు వస్తే.. ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుందని ఆమె చెప్పారు.

Advertisement
Advertisement