‘రక్షణ’లో పెట్టుబడులకు స్వాగతం 

Aero India is the grandest start in Bangalore - Sakshi

100% ఎఫ్‌డీఐలకు అనుమతి 

రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌  

బెంగళూరులో ఘనంగా ఏరో ఇండియా ఆరంభం 

సాక్షి, బెంగళూరు: ప్రధాని మోదీ ప్రకటించిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పథకం మరింత విజయవంతమయ్యేలా వైమానిక రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని సంస్థలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. బుధవారం బెంగళూరులోని యలహంక వాయుసేన స్థావరంలో ఐదురోజుల అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా, 2019’ను నిర్మల ప్రారంభించారు. రక్షణ రంగంలో పరికరాల తయారీ కోసం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు. ఇందులో 600 దేశీయ, 400 విదేశీ సంస్థలు పాల్గొన్నాయి. అత్యాధునిక యుద్ధ, పౌర విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించాయి. 

పాకిస్తాన్‌తో యుద్ధానికి సిద్ధం  
ఉగ్రవాదులు దాడులతో భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని నిర్మల అన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధమే వస్తే అందుకు కూడా సైనికులు సిద్ధమేనని చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో యుద్ధ విమానాలు, ఆయుధాలు, రక్షణరంగ పరికరాలను కొనుగోలుకు సంబంధించి భారత రక్షణశాఖ రూ. 1,27,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుందన్నారు. 

2 వేల పౌర విమానాలు అవసరం
ప్రతీ భారతీయుడికి విమాన సేవలను అందిం చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు విమానయాన మంత్రి సురేశ్‌ ప్రభు చెప్పారు. దేశానికి 2000కుపైగా పౌర విమానాల అవసరముందన్నారు. దేశంలో 235 నగరాలకు విమానసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల కోసం 65 బిలియన్‌ డాలర్లను ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాల అధిపతులు, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఉన్నతాధికారులు, వందలాది మంది సందర్శకులు హాజరయ్యారు. 

ప్రత్యేక ఆకర్షణగా రఫేల్‌ 
ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయనున్న రఫేల్‌ యుద్ధవిమానం ఎయిర్‌షోలో సందర్శకుల మనసు దోచుకుంది. మంగళ వారం సూర్యకిరణ్‌ విన్యాసవిమానాలు ఢీకొన్న ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వింగ్‌ కమాండర్, పైలట్‌ సాహిల్‌ గాంధీకి నివాళిగా తక్కువ ఎత్తులో, తలకిందులుగా ప్రయాణించింది. షోలో డకోటా విమానం, ధృవ్, హాక్, హెచ్‌టీటీ40 తదితర విమానాలు, హెలికాప్టర్లు విన్యాసాలతో సందర్శకులు అలరించాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top