‘అష్ట’దిగ్బంధనం..

24 Pak Jets Tried To Cross Over, Intercepted By 8 Air Force Fighters - Sakshi

24 పాక్‌ విమానాల పరార్‌

న్యూఢిల్లీ: ఇరవైనాలుగు లోహ విహంగాలతో భారత్‌పైకి దాడికి తెగబడిన పాకిస్తాన్‌ను ఎనిమిది భారత యుద్ధవిమానాలు బెదరగొట్టాయి. దీంతో పాక్‌ విమానాలు తోకముడుచుకుని పారిపోయా యి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్‌ దళాలకు చిక్కిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ క్షేమంగా దేశానికి రావాలని ప్రార్థిస్తున్న వేళ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది ఎఫ్‌–16లు, నాలుగు మిరాజ్‌–3 రకం విమానాలు, నాలుగు చైనా తయా రీ జేఎఫ్‌–17 ‘థండర్‌’ యుద్ధవిమానాలతో కూడిన ఫైటర్‌జెట్‌ విమానాల సమూహాన్ని పాకిస్తాన్‌ భారత్‌పైకి దాడికి పంపింది.

భారత వాయుసేన దాడుల గురించి అప్రమత్తం చేసేందుకు ఈ జెట్‌లకు మరో పాక్‌ విమానం తోడుగా వచ్చింది. ఈ విమానాలన్నీ ఉదయం 9.45గంటల సమయంలో భారత్‌ వైపుగా రావడాన్ని సరిహద్దుకు 10 కి.మీ.ల దూరంలో ఉన్నపుడు భారత వాయుసేన దళాలు పసిగట్టాయి. ఒక్కొక్కటిగా అవి భారతభూగంలోకి దూసుకొస్తుండగా వెంటనే భారత్‌ వాయుసేనకు చెందిన నాలుగు సుఖోయ్‌ 30 విమానాలు, రెండు ఆధునీకరించిన మిరాజ్‌ 2000లు, రెండు మిగ్‌–21 బైసన్‌లు రంగంలోకి దిగి వెంటబడ్డాయి. భారత యుద్ధవిమానాలు వెంటబడుతుండడంతో పాక్‌ యుద్ధవిమానాలు విసిరిన బాంబులు లక్ష్యాలను గురితప్పాయి. సరిహద్దు వెంట ఉన్న భారత ఆర్మీ లక్ష్యాలకు సమీపంలో బాంబులు పడ్డాయి.

పాక్‌ ఫైటర్‌జెట్‌ విమానాల బృందంలోని ఎఫ్‌–16 జెట్‌ను కూల్చేందుకు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ మిగ్‌–21 బైసన్‌ యుద్దవిమానం ద్వారా ‘ఎఫ్‌–73 ఎయిర్‌–టు–ఎయిర్‌ క్షిపణి’ని ప్రయోగించారు. దీంతో ఎఫ్‌–16 మంటల్లో చిక్కుకుంది. కానీ, అదే సమయంలో ఎఫ్‌–16 సైతం అభినందన్‌ నడుపుతున్న మిగ్‌పైకి రెండు (అడ్వాన్స్‌డ్‌ మీడియం రేంజ్‌ ఎయిర్‌–టు–ఎయిర్‌ మిస్సైల్‌–అమ్‌రామ్‌) క్షిపణులను ప్రయోగించింది. అది ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి తప్పిపోగా, మరొకటి అభినందన్‌ నడుపుతున్న మిగ్‌ను ఢీకొట్టింది. దీంతో కూలిపోతున్న మిగ్‌ నుంచి అభినందన్‌ ప్యారాచూట్‌తో బయటకు దూకేశారు. దెబ్బతిన్న పాక్‌ ఎఫ్‌–16 సైతం కుప్పకూలింది. మంటల్లో చిక్కుకుని కూలిపోతున్న ఎఫ్‌–16 నుంచి ఇద్దరు పాక్‌ పైలట్లు ప్యారాచూట్‌ల సాయంతో సరిహద్దు ఆవల ల్యాండ్‌ అయ్యారు.

‘జమాతే ఇస్లామీ’పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: వేర్పాటువాద సంస్థ జమాతే ఇస్లామీ జమ్మూకశ్మీర్‌పై గురువారం కేంద్రం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నందున చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర కేబినెట్‌ భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. పుల్వామా దాడి అనంతరం భద్రతా బలగాలు. వివిధ వేర్పాటు వాద సంస్థల నేతలతోపాటు పెద్ద సంఖ్యలో జమాతే ఇస్లామీ శ్రేణులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

ప్రధాని అధ్యక్షతన కేబినెట్‌ కమిటీ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పాక్‌తో ఉద్రిక్తతలు, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను వెనక్కి పంపించాలన్న పాక్‌ ప్రకటన నేపథ్యంలో గురువారం ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశమైంది. ఉగ్రస్థావరాల ధ్వంసం, మసూద్‌ అజర్‌పై చర్యలకు సంబంధించి పాక్‌ నుంచి ఎటువంటి హామీ రానంత వరకు సంయమనం పాటించినా ఎటువంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమై నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడులకు తలొగ్గిన పాక్‌ ఐఏఎఫ్‌ పైలట్‌ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందని ఈ కమిటీ అభిప్రాయపడింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభినందన్‌ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం మంచి పరిణామమని పేర్కొంది.

అయితే, బుధవారం పాక్‌ యుద్ధ విమానాలు భారత్‌ గగనతలంలోకి చొచ్చుకు రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు ఎఫ్‌–16 విమానాల ద్వారా అమెరికా తయారీ అమ్రోన్‌ క్షిపణులతో దాడికి యత్నించడాన్ని దురాక్రమణ చర్యేనని పేర్కొంది. ఎన్నికల వేళ ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకున్నా రాజకీయంగా వికటించే ప్రమాదముందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. అభినందన్‌ స్వదేశానికి చేరుకున్న తర్వాతే పాక్‌పై మిగతా చర్యలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. భేటీలో కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్‌ సింగ్, అరుణ్‌ జైట్లీ, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.

పాక్‌ మోర్టార్‌ దాడుల్లో మహిళ మృతి
జమ్మూ: కశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లోని ఆరు సెక్టార్లలో పౌర ఆవాసాలపై పాక్‌ సైన్యం గురువారం జరిపిన మోర్టార్‌ దాడుల్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఒక జవానుకు గాయాలయ్యాయి. పాక్‌ దాడులకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని అధికారులు చెప్పారు. సరిహద్దు వెంట పాక్‌ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం వరుసగా ఇది ఏడవ రోజు. సుందర్బని, మాన్‌కోట్, ఖరికర్మారా, డెగ్వార్‌ సెక్టార్లలో పాక్‌ భారీ ఎత్తున మోర్టార్‌లు, తేలికపాటి ఆయుధాలతో కాల్పు లు జరుపుతోందని రక్షణ ప్రతినిధి వెల్లడించారు. మెందార్‌లోని చజ్జలలో పాక్‌ మోర్టార్‌ శకలం తగిలి ఓ మహిళ మరణించగా, మరో ఘటనలో జవాను గాయపడ్డాడని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top