యాద్గార్‌పల్లి చిన్న చెరువు ఆక్రమణ

16 acres of yadgarpally lake land kabza - Sakshi

కబ్జాకు గురైన 16 ఎకరాలు

ఆనవాళ్లు కోల్పోయిన చెరువు

అధికారులకు డబ్బులు ఇవ్వాలని మధ్యవర్తుల వసూళ్లు

సందర్శించిన రెవెన్యూ, ఐబీ అధికారులు

మిర్యాలగూడ : కోట్ల రూపాయల విలువైన యాద్గార్‌పల్లి చిన్న చెరువు ఆక్రమణకు గురైంది. కనీసం చెరువు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఆక్రమిత స్థలంలో వరినాట్లు వేసుకోవడంతోపాటు రోడ్డు వెంట ఆక్రమించుకున్న స్థలంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లిలోని రోడ్డు వెంటనే ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 16 ఎకరాలు. ప్రస్తుతం చెరువు శిఖం భూమి ఏ మాత్రం మిగల్లేదు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎకరం భూమి 50 లక్షల రూపాయల విలువ చేస్తుంది.   సుమారు 8 కోట్ల రూపాయల విలువైన చెరువు శిఖం భూమి ఆక్రమణకు గురైంది. చెరువు శిఖంలో కొంత భూమి ఉండగా దానిలో ఒక సంఘ కార్యాలయం ఏర్పాటు చేయడానికి గాను మట్టి పోయిస్తున్నారు.

డబ్బులు వసూలు చేస్తున్న మధ్యవర్తులు
చెరువు ఆక్రమణకు సంబందించి అధికారులు ఎవరు కూడా తమ వద్దకు రాకుండా ఉండేందుకు గాను డబ్బులు ఇవ్వాలని మధ్యవర్తులు ఆక్రమితదారులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. చెరువు శిఖంలో సాగు చేసుకుంటున్న వారితోపాటు రోడ్డు వెంట ఉన్న వారు సైతం డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది.

పరిశీలించిన అధికారులు
యాద్గార్‌పల్లి చిన్న చెరువును రెవెన్యూ అధికారులు, ఐబీ అధికారులు గురువారం సందర్శించారు. తహసీల్దార్‌ మాలి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చెరువు ఆనవాళ్లు లేకుండా ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆక్రమితదారులందరికి నోటీసులు ఇస్తామని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విలువైన చెరువు భూమిని ఆక్రమించుకున్న వారందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఎఈ విజయలక్ష్మి, ఆర్‌ఐ, వీఆర్‌ఓ ఉన్నారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top