నాన్నా... ఈ సినిమా మీ కోసమే

Venkatesh Gets Emotional at Venky Mama Movie Press Meet - Sakshi

– వెంకటేష్‌

‘‘వెంకీమామ’ పక్కా తెలుగు చిత్రం. వల్గారిటీ తప్ప సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు డి. సురేష్‌బాబు. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్‌రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేష్‌ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ‘వెంకీమామ’ ప్రత్యేకమైనది. రానా, నాగచైతన్యలతో కలిసి పని చేయాలనుకుంటాను.

ఆ కల నేరవేరిందని చెప్పొచ్చు. నాన్నగారు (డి.రామానాయుడు) మా అందరితో సినిమా చేయాలనుకునేవారు. నాన్నగారు ఉండి ఉంటే ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేసేవారు. ‘నాన్నా.. ఈ సినిమా మీ కోసమే’. ఇందులో నాగచైతన్య ఆల్‌రౌండర్‌ పెర్ఫార్మెన్స్‌ చేశాడు. మామా అల్లుళ్ల కథను చాలా సెన్సిబుల్‌గా తెరకెక్కించాడు బాబీ. తమన్‌ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. ‘‘నేను ఎన్ని సినిమాలు చేసినా ‘మనం, వెంకీమామ’ నాకు మంచి జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. కాస్త ఆలస్యమైనా సురేష్‌ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయాలనే నా ఆశ నేరవేరింది. ‘ప్రేమమ్‌’ సినిమాలో ఓ చిన్న సన్నివేశంలో మామయ్య వెంకటేష్‌గారితో కలిసి నటించినప్పుడే చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఇప్పుడు ‘వెంకీమామ’లో మామయ్యతో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉంది.

రాశీతో కలిసి ఇంకా సినిమాలు చేయాలని ఉంది’’ అన్నారు నాగచైతన్య. ‘‘వెంకీమామ’ సినిమా షూటింగ్‌ టైమ్‌లో నా మామయ్య సురేంద్ర నాకు గుర్తుకు వచ్చారు. అలా ఈ  చిత్రం చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల జీవితాల్లోని వారి మామయ్యలు గుర్తుకు వస్తారు. బాబీ సినిమాను బాగా తీశాడు. నాకు సినిమా అంటే చాలా భయం. ఈ సినిమా ఫస్ట్‌ కాపీ చూశాను. నాకంటూ ఓ అభిప్రాయం ఉన్నప్పటికీ ఇతరుల అభిప్రాయల కోసం కంగారుగా ఎదురుచూస్తుంటాను. ఈ సినిమాను తొలిసారి తమన్‌ చూశాడు. చాలా ఎమోషనల్‌గా ఉందన్నాడు. వెంకటేశ్, నాగచైతన్యలు కూడా చూసి బాగుందన్నారు. మా డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా సినిమా నచ్చిందన్నారు. చివర్లో వచ్చి సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేసిన ప్రకాశ్‌రాజ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు డి. సురేష్‌బాబు.

‘‘సురేష్‌బాబుగారికి కథ చెప్పబోతున్నాను అన్నప్పుడు కొందరు భయపెట్టారు. ఆయన బుక్‌ లాంటి వారు అన్నారు. నేను కథ చెప్పిన తర్వాత ‘సూపర్బ్‌ సూపర్బ్‌’ అన్నారు. ఈ సినిమా చూసేప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న మేనమామకి తన అల్లుడు, అల్లుడికి తన మామ గుర్తుకు వస్తారు. వెంకటేష్‌గారికి కథ చెప్పినప్పుడు.. చైతూ పాత్రను ఇంకొంచెం బాగా చేయమన్నారు. అప్పడు నాకు మరింత తెలిసింది.. నిజమైన మామాఅల్లుళ్ల బంధం గురించి. ఇద్దరూ  బాగా నటించారు’’ అన్నారు బాబీ. ‘‘భావోద్వేగ సన్నివేశాల్లో వెంకటేష్‌గారు మాస్టర్‌. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఎమోషనల్‌ సీన్స్‌లో బాగా నటించారు’’ అన్నారు వివేక్‌ కూచిభొట్ల. ‘‘ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్‌టైనింగ్‌ చిత్రం ఇది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌. ‘‘వెంకటేష్‌గారితో నాకు కొన్ని కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నాయి. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. చైతూ మంచి కో–స్టార్‌’’ అన్నారు రాశీఖన్నా. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top