గొప్ప  అవకాశం  లభించింది : అశ్వినీదత్‌

Union Minister Prahlad Joshi Meets Ashwini Dutt - Sakshi

వైజయంతీ మూవీస్‌ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ను మంగళవారం ఆయన కార్యాలయంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కలిశారు. మోదీ ప్రభుత్వం సాధించిన ఆర్టికల్‌ 370 విజయ కరదీపికను, మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రహ్లాద్‌ జోషితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇరవై నిమిషాల పాటు సినిమాలు, మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై పరస్పరం చర్చించుకున్నారు. అశ్వినీ దత్‌ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ఇటీవల జాతీయ అవార్డు సాధించిన ‘మహానటి’ సినిమా గురించి మాట్లాడుకున్నారు. 

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో స్వప్నాదత్, ప్రియాంకా దత్‌ ‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అశ్వినీదత్‌ మాట్లాడుతూ– ‘‘ఈ రోజు గొప్ప అవకాశం లభించింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి వచ్చి నాగ్‌ అశ్విన్, ప్రియాంకాలను అభినందించారు. దేశం మొత్తం మోదీ పనితీరును ప్రశంసిస్తోంది. ప్రధాని మోదీ తీసుకున్న ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం మనకు గర్వకారణం. కశ్మీర్‌ మనదని చాటారు. దేశం కోసం మోదీ ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. ఆనాడు మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత వాజ్‌పాయ్‌ పాలనలో గొప్ప పరిపాలన చూశాం. మళ్లీ మోదీ హయాంలో చూస్తున్నాం. జీఎస్టీ విషయంలో మేం సూచించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి సహకరించారు. మోదీకి (మంగళవారం మోదీ పుట్టినరోజు) ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలి. మా నుంచి ప్రభుత్వానికి అన్నిరకాల సహకారాలు ఉంటాయని ప్రహ్లాద్‌ జోషీకి చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై దృష్టి సారించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరాను’’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top