తూనీగ ఆడియో విడుదల | Tooneega Movie Audio Launched | Sakshi
Sakshi News home page

తూనీగ ఆడియో విడుదల

Aug 5 2019 8:51 PM | Updated on Aug 5 2019 8:56 PM

Tooneega Movie Audio Launched - Sakshi

సాక్షి, హైదరాబాద్: వినీత్, దేవ‌యానీ శ‌ర్మ జంటగా న‌టించిన తూనీగ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆకాంక్షించారు. తూనీగ చిత్ర స్వ‌రాల వేడుక‌ యూనిట్ స‌భ్యుల కుటుంబ స‌భ్యులు, ఇతర సినీ అభిమానుల కేరింతల న‌డుమ రామానాయుడు స్టూడియోలో సోమవారం జరిగింది. సీనియ‌ర్ డైలాగ్ రైట‌ర్ మ‌రుధూరి రాజా, రాజ్ కందుకూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ..  ఇటీవ‌ల విడుద‌ల‌యిన చిన్న చిత్రాలన్నీ బాక్సాఫీసుకు బొనాంజాగా నిలిచాయ‌ని, అదే క్ర‌మంలో ఈ సినిమా చేరాల‌న్న‌ది త‌న అభిమ‌తం అన్నారు. త‌న‌కూ ఉత్త‌రాంధ్ర నేల‌తో మంచి అనుబంధం ఉంద‌ని గుర్తుచేసుకున్నారు. మ‌రుధూరి రాజా మాట్లాడుతూ.. ఉత్త‌రాంధ్ర అంటే ఉద్య‌మాల గ‌డ్డ అని, అలాంటి నేల నుంచి వ‌చ్చిన దర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్ ఈ చిత్రం కోసం ఎంతో క‌ష్టించార‌ని, తొలి ప్ర‌య‌త్నంతోనే విజ‌యం సాధించాల‌ని దీవించారు. వ‌ర్థ‌మాన ర‌చ‌యిత ర‌త్న‌కిశోర్ శంభు మహంతి త‌న‌కు అత్యంత ఆప్తుడ‌ని, సోదర స‌మానుడని అన్నారు.

హీరో వినీత్ చంద్రతో స‌హా ఇత‌ర న‌టీన‌టులు వారి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ స్వ‌రాల వేడుక‌కు అతిథులుగా ప్రొడ్యూసర్ దేవీగ్రంథం, నెపోలియెన్ మూవీ ప్రొడ్యూసర్ బొగేంద్ర గుప్త మామిడిపల్లి, ఫిల్మ్ ఛాంబర్ మెంబర్ పద్మిని నాగులపల్లి, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు, యంగ్ హీరో మనోహర్ విచ్చేశారు. తొలి సీడీని చిత్ర స‌మ‌ర్ప‌కులు ప‌ద్మావ‌తి, దేవీప్రియ సంయుక్తంగా అందుకున్నారు. కార్య‌క్రమంలో సంగీత ద‌ర్శ‌కులు సిద్ధార్థ్ స‌దాశివుని, సినిమాటొగ్ర‌ఫర్ హ‌రీష్ ఎదిగ, పోస్ట‌ర్ డిజైన‌ర్ ఎంకేఎస్ మ‌నోజ్, ప్రోమో డైలాగ్, లిరికల్ వీడియోస్ ఎడిట‌ర్ నికిల్ కాలేపు, పాట‌ల ర‌చ‌యిత‌లు కిట్టు, ఫ‌ణి, గాయ‌కులు క‌రీముల్లా, విశ్వ‌, ఇషాక్, స‌హ నిర్మాత క‌ర్రి ర‌మేశ్, న‌టీన‌టులు సిల్వ‌ర్ సురేశ్, చైత్రిక, త‌దిత‌ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement