దీపావళి ఎఫెక్ట్‌: హల్‌చల్‌ చేస్తున్న సినిమాలు | Sakshi
Sakshi News home page

దీపావళి ఎఫెక్ట్‌: హల్‌చల్‌ చేస్తున్న సినిమాలు

Published Sun, Oct 27 2019 1:53 PM

Tollywood Releasing Movies Launched Posters And Teasers - Sakshi

సినీ అభిమానులకు దీపావళి రెట్టింపు పండగ వాతావరణం తెచ్చింది. దీపావళి కానుకగా తమ అభిమాన హీరోహీరోయిన్ల కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలు, విశేషాలను చిత్ర బృందాలు విడుదల చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానులు దీపావళికి డబుల్‌ ధమాకా అందుకున్నారు. ఇప్పటికే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పలు చిత్రాలకు సంబంధించిన టైటిల్స్‌ను అనౌన్స్‌ చేయడంతో పాటు.. మరికొన్ని చిత్రాల్లోని హీరోహీరోయిన్లతో పాటు ముఖ్య తారాగణం లుక్‌లను విడుదల చేశారు. అంతేకాకుండా ఆయా చిత్రాల టీజర్‌, ప్రి టీజర్‌, మోషన్‌ పోస్టర్లను కూడా అభిమానులపై వదులుతూ సినీ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వంటి పెద్ద సినిమాలతో మొదలెడితే.. తిప్పరామీసం, అక్షర వంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.

భయపెడుత్నున సాయిపల్లవి
సాయిపల్లవి, ఫహద్‌ ఫాసిల్‌, ప్రకాష్‌ రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అధిరన్‌’. తెలుగులో ‘అనుకోని అతిధి’. ఈ మూవీలో సాయిపల్లవి ఇప్పటివరకు పోషించనట్టువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్‌, సాయి పల్లవి లుక్‌ తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకంక్షలు తెలుపుతూ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. టీజర్‌ను పరిశీలిస్తే సాయి పల్లవి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. వివేక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నవంబర్‌ 15న విడుదల కానుంది.   

సరిలేరు నీకెవ్వరు..
మహేశ్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.దీపావళి సందర్భంగా దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి లుక్‌తో పాటు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు పోస్టర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇక  ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

అల వైకుంఠపురంలో..
స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘అల వైకుంఠపురములో’ . వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, బన్నీ డైలాగ్‌తో పాటు ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు ఎంత పాపులర్‌ అయ్యాయో తెలిసింది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర బృందం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న సభ్యులందరూ దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. 

డిస్కో రాజా
మాస్‌ మహారాజ్‌ రవితేజ తెరపై కనిపించి చాలా కాలమే అయింది. వరుస ఫెయిల్యూర్‌తో ఢీలా పడిన రవితేజ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా గ్యాప్‌ తర్వాత వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’ . పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్‌. తాజాగా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ డిస్కో రాజా పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవితేజ నభా నటేష్‌తో జంటగా కనిపించాడు. దీంతో ఈ చిత్రంలో యాక్షన్‌, ఎంటర్‌టైన్మెంట్‌, రొమాన్స్‌లు కొదువే లేదని స్పష్టం అవుతోంది. రజిని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

తిప్పరా మీసం..
కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తిప్పరామీసం. ఎల్‌ కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శ్రీవిష్ణు ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలపుతూ మరో పోస్టర్‌ను విడుదలు చేసింది. శ్రీ విష్ణు రఫ్‌ లుక్‌లో కనిపిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 8న విడుదల కానుంది. ఇక ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘సూపర్‌ మచ్చి’అంటున్న చిరు అల్లుడు
‘విజేత’ఫలితం తర్వాత చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ నటిస్తున్న ‘సూపర్‌ మచ్చి’ . రిజ్వాన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ హీరో, హీరోయిన్ల పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఎలాగైనా ఈ చిత్రంతో విజయం సాధించాలని కళ్యాణ్‌ దేవ్‌తో పాటు మెగా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.  

‘అశ్వథ్థామ’గా నాగశౌర్య
అంతేకాకుండా నాగశౌర్య, మెహరీన్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా చిత్ర టైటిల్‌ను ‘అశ్వథ్థామ’గా ఫిక్స్‌ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్‌ లోగో అండ్‌ డిజైన్‌ ఆకట్టుకునేలా ఉంది. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.  

ఇప్పటికే విక్టరీ వెంకటేశ్‌, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ‘వెంకీ మామ’, నందమూరి బాలకృష్ణ ‘రూలర్‌’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’,సత్యదేవ్‌, ఇషారెబ్బ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న‘రాగల 24 గంటల్లో’ చిత్రాలు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్‌ చేసిన పోస్టర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి, . అంతేకాకుండా నిఖిల్‌ ‘అర్జున్‌ సురవరం’సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా దీపావళి కానుకగా విడుదల చేసింది. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో రాజ్‌కుమార్‌ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది. ఇక దీపావళి కానుకగా సోషల్‌ మీడియా వేదికగా ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్‌లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement