పోలీస్ పంచ్

పోలీస్ పంచ్ - Sakshi


‘కనిపించే మూడు సింహాలు నీతికీ న్యాయానికీ ధర్మానికీ సంకేతాలైతే... కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’... ‘పోలీస్ స్టోరీ’లో  డైలాగ్ కింగ్ సాయికుమార్ చెప్పిన ఈ డైలాగ్‌ని అంత సులువుగా మర్చిపోలేం. చురకత్తుల్లాంటి చూపులు, మాటల్లో వాడి, నడకలో సింహంలాంటి వేగం... ఇలా పోలీస్ పాత్రల్లో హీరోలు కనిపిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్. అందుకే పోలీస్ సినిమాలంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఖాకీ బాబుల  సినిమాలకు ట్రెండ్‌తో సంబంధం ఉండదు. కథ, పాత్రలో దమ్ముంటే చాలు పోలీస్ సినిమాలు హిట్టయిపోతాయ్. ఇప్పటివరకూ వెండితెరపై ఎన్నో హిట్ పోలీస్ కథలొచ్చాయ్. మరో నాలుగైదు నెలల్లో విడుదల కాబోయే చిత్రాల్లో ఆరేడు పోలీసు సినిమాలు ఉండటం విశేషం.

 

‘ఘర్షణ’లో పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ ఏ స్థాయిలో విజృంభించారో గుర్తుండే ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో అసలు సిసలైన పోలీసాఫీసర్‌ను తలపించారాయన. పోలీస్ పాత్రలో మరోసారి వెంకీ కనిపించనున్నారు. మారుతి దర్శకత్వంలో నటించిన ‘బాబు బంగారం’లో ఆయన పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ‘లక్ష్మి’, ‘తులసి’ చిత్రాల్లో వెంకీ సరసన నటించిన నయనతార ఇందులో కథానాయిక. ఆగస్ట్ 12న ఈ చిత్రం విడుదల కానుంది.



ఆ తర్వాత రెండు నెలలకు రామ్‌చరణ్ పోలీస్ పాత్రలో తెరపై కనిపిస్తారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’ రీమేక్ ‘ధ్రువ’లో రామ్‌చరణ్ యువ ఐపీఎస్ అధికారి పాత్రలో అలరించనున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హిందీ చిత్రం ‘జంజీర్’లో చరణ్ పోలీస్‌గా కనిపించినప్పటికీ, తెలుగు తెరపై కనిపించబోతున్నది ఇదే. ‘బ్రూస్‌లీ’లో ఓ సన్నివేశంలో చరణ్ పోలీస్ డ్రెస్‌లో కనిపించారు. తాజా చిత్రం కోసం చాలా మేకోవర్ అయ్యారు. మీసకట్టు, హెయిర్ స్టైల్, ఫిజిక్ అన్నీ భేష్ అనేలా ఉన్నాయి. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.



ఆ విషయం అలా ఉంచితే.. రామ్‌చరణ్, శర్వానంద్ మంచి ఫ్రెండ్స్. ఈ ఇద్దరూ ఒకేసారి పోలీస్ పాత్రల్లో నటించడం విశేషం. ‘ప్రస్థానం’ నుంచి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వరకూ శర్వానంద్ చేసినవన్నీ డిఫరెంట్ మూవీసే. కథ, పాత్ర ఎంపిక చేసుకునే విషయంలో చాలా కేర్ తీసుకుంటారాయన. ఇప్పటివరకూ కనిపించిన శర్వానంద్ వేరు.. ఇప్పుడు కనిపించనున్న శర్వానంద్ వేరు అనే విధంగా తాజా చిత్రం కోసం మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.



 ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ రామ్. ప్రస్తుతం ఈ హీరో కూడా తొలిసారి పోలీస్ గెటప్ వేసుకున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో రామ్ లాఠీతో రౌడీలను రఫ్ఫాడనున్నారు. ప్రస్తుతం ఒక మెగా హీరో ఆల్రెడీ పోలీస్‌గా నటిస్తున్నారు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఆ పాత్రలో అలరించనున్నారు. ‘కంచె’లో వరుణ్ సైనికుడిగా కనిపించి, భేష్ అనిపించుకున్న విషయం గుర్తుండే ఉంటుంది.



ఇప్పుడు శ్రీను వెట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘మిస్టర్’ చిత్రంలో చేస్తున్నది పోలీస్ పాత్రే అని సమాచారం.  పోలీస్ పాత్రలతో పెద్ద సినిమాలే కాదు.. కొన్ని మీడియమ్ బడ్జెట్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు కూడా రూపొందుతున్నాయి. శ్రీకాంత్ పోలీసాఫీసర్‌గా నటించిన ‘మెంటల్’ విడుదలకు సిద్ధమైంది. శివ జొన్నలగడ్డ నటించి, దర్శకత్వం వహించిన ‘పోలీస్ పవర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా పోలీస్ పాత్రలతో మరిన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.

 

 పోలీసు పాత్రల్లో వచ్చిన మార్పు

 గతంలో వచ్చిన పోలీస్ చిత్రాలను గమనిస్తే హీరోలను నిజాయతీ అధికారులుగా చూపించేవారు.  నీతి, న్యాయం, ధర్మానికి కట్టుబడి .. అవినీతికి పాల్పడకుండా నిజాయతీగా ఉండే చిత్రాలే ఎక్కువగా వచ్చేవి. సినిమాల్లో మార్చు వచ్చినట్లుగానే పోలీసు చిత్రాల్లో కూడా మార్పొచింది. ‘అండర్ కవర్ పోలీస్’ పాత్రలు వస్తున్నాయ్.  తొలి భాగంలో అవినీతి అధికారులుగా కనిపించి, రెండో భాగంలో సిన్సియర్ ఆఫీసర్ల పాత్రలో కనిపించే కథలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. పోలీస్ అంటే ఎప్పుడూ సీరియస్సేనా? కాస్తంత కామెడీ ఉంటే బాగుంటుందనే ట్రెండ్ కూడా నడుస్తోంది. ‘గబ్బర్‌సింగ్’లో రౌడీలతో పవన్ కల్యాణ్ ఆడించిన అంత్యాక్షరి సినిమాకి ఓ హైలైట్. సినిమా మొత్తంలో ఓ నాలుగైదు సన్నివేశాల్లో అలా పోలీసు పాత్రలు సరదాగా ఉంటే ప్రేక్షకులకు కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్.

 

 మేము సైతం అంటున్న హీరోయిన్లు

 పోలీస్ పాత్రలు చేయాలని హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా ఎదురు చూస్తుంటారు. ‘కర్తవ్యం’ చిత్రంలో సిన్సియర్‌గా పోలీస్‌గా కనిపించి, సినిమా మొత్తాన్ని భుజాలపై మోయగలుగుతానని నిరూపించుకున్నారు విజయశాంతి. పోలీస్ పాత్రలంటే విజయశాంతియే ఇన్‌స్పిరేషన్ అని నేటి తరం నాయకలు అంటుంటారు. ఆ మధ్య విడుదలైన ‘సుప్రీమ్’లో పోలీస్ పాత్రలో కనిపించారు రాశీఖన్నా. ఇంకా యువకథానాయికలు పోలీసులుగా తమ సత్తా చాటడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడూ గ్లామరస్ రోల్స్‌లో కనిపిస్తే చూసేవాళ్లకే కాదు.. చేసేవాళ్లకు కూడా బోర్ అనిపిస్తుంది కాబట్టి, హీరోయిన్లు కూడా పవర్‌ఫుల్ రోల్స్ చేయడానికి మోజు పడతారని ఊహించవచ్చు.



 ప్రస్తుతం ఆన్ సెట్స్‌లో ఉన్న ‘నక్షత్రం’లో రెజీనా పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆల్‌మోస్ట్ గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన ఈ బ్యూటీ పోలీస్‌గా ఏ మేరకు విజృంభిస్తారో చూడాలి. ఇక.. పవర్‌ఫుల్ రోల్స్ అంటే అనుష్కనే అన్నట్లుగా ఆమె చేసిన ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ వంటి చిత్రాలు నిరూపించాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘భాగమతి’ ఒకటి. ఇందులో అనుష్క కాసేపు పోలీస్‌గా కనిపిస్తారని సమాచారం. మరి.. భవిష్యత్తులో ఎంతమంది ఆడ పోలీసులు తెరపై కనిపిస్తారో చూడాలి.

 

 ఎవర్ గ్రీన్ పోలీస్

 హీరోలు పోలీసు పాత్రల్లో కనిపించడం టాలీవుడ్‌లో ఇప్పుడు ప్రారంభమైన కొత్త ట్రెండేమీ కాదు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితర హీరోలు పోలీసు పాత్రల్లో లాఠీ ఝళిపించినవారే. తర్వాతి తరంలో మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి హీరోలు పోలీసు పాత్రల్లో ఆకట్టుకున్నారు. సాయికుమార్ చేసిన ‘పోలీస్ స్టోరి’ని ఎప్పటికీ మరచిపోలేం. రాజ శేఖర్ చేసిన ‘అంకుశం’ అద్భుతమైన పోలీస్ సినిమా. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, రవితేజ, ఎన్టీఆర్,

 అల్లు అర్జున్, జగపతి బాబు, కల్యాణ్ రామ్ వంటి హీరోలు కూడా ఖాకీ చొక్కా సత్తా చాటారు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకూ అందరికీ పోలీస్ పాత్రలపై మక్కువ ఉంటుంది. ఖాకీ డ్రెస్ క్రేజ్ అలాంటిది. అందుకే పోలీస్ క్యారెక్టర్స్ ఎవర్ గ్రీన్.

 

 కొన్ని పాపులర్ పోలీస్ డైలాగ్స్


 

 బాలకృష్ణ: లక్ష్మీనరసింహ

కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఐదుగురు కొడుకులు పుట్టి చనిపోయాక...ఈ సారి పుట్టబోయే బిడ్డ చంపేటోడు కావాలే కానీ,  చచ్చేటోడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడురా మా నాన్న లక్ష్మీనరసింహస్వామి అని.

 

 నాగార్జున: శివమణి

 నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్. పూర్ణా మార్కెట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ని.

 

 పవన్‌కల్యాణ్: గబ్బర్‌సింగ్

 నా తిక్కేంటో చూపిస్తా.. అందరి లెక్కలు తేలుస్తా.

 

  మహేశ్‌బాబు: దూకుడు

 మజాక్ చేయడానికి నేను నీ సాలేగాణ్ణి అనుకొన్నావా.. పోలీస్.

 

  రవితేజ: విక్రమార్కుడు

 చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్లల్లో బెరుకు ఉండకూడదు. నా మూతిమీద చిరునవ్వు ఉండాలి. నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్.

 

  రాజశేఖర్: అంకుశం

 పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టీ అనుకున్నావా... లేకుంటే నువ్వు నడిపే బ్రోతల్ హౌస్ అనుకున్నావా?

 

 - డేరంగుల జగన్ మోహన్

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top